Friday, May 17, 2024

ఓబీసీ కులాలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం.. కేంద్ర జాబితాలో చేర్చకుండా అలసత్వం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వోద్యోగాలు, కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోసం కేంద్ర జాబితాలో వెనుకబడిన కులాలను చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సిఫారసు, విజ్ఞప్తి చేయలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 146 కులాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల రాష్ట్ర జాబితాలో చేర్చారు. అయితే కేంద్ర ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కోసం బీసీల సెంట్రల్ జాబితాలో 107 కులాలను మాత్రమే చేర్చారు. మిగిలిన 39 కులాలను కేంద్ర జాబితాలో చేర్చకపోవడానికి, కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండటానికి గల కారణాలేంటని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఆయన ప్రశ్నలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖా సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ బుధవారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యర్థనలు చేయనందున, వెనుకబడిన కులాలను కేంద్ర బీసీల జాబితాలో చేర్చే అంశం తమ వద్ద పెండింగ్‌లో లేదని స్పష్టం చేశారు. వైసీపీ, టీడీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా బీసీల రాష్ట్ర జాబితాలో ఉన్న 39 బీసీ కులాలకు కేంద్ర ప్రభుత్వోద్యోగాలు, కేంద్ర విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల ప్రయోజనం లేకుండా పోయింది. వైసీపీ, టీడీపీ రెండూ బీసీలకు అనుకూలమని చెప్పుకుంటున్నా, రెండూ బీసీల ప్రయోజనాలకు ద్రోహం చేశాయని జీవీఎల్ అన్నారు.

తూర్పు కాపులకు అన్యాయం..

తూర్పు కాపులను కేంద్ర జాబితాలో కేవలం మూడు జిల్లాలో మాత్రమే బీసీలుగా గుర్తించారు. అన్ని జిల్లాలలో తూర్పు కాపులకు కేంద్రంలో రిజర్వేషన్లు ఇవ్వమని ఏ ప్రతిపాదన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని కేంద్రం తెలిపింది. తూర్పు కాపులను ఇటు రాష్ట్ర జాబితాలో, కేంద్ర బీసీల జాబితాలో మూడు జిల్లాలకే పరిమితం చేయడం అన్యాయమని, ఈ విషయంపై తాను కేంద్రమంత్రితో మాట్లాడతానని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement