Saturday, May 4, 2024

AP : టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల..బాలిక‌లే టాప్‌..పార్వతీపురం ఫస్ట్

పదో త‌ర‌గ‌తి ఫ‌లితాలు వెల్ల‌డించిన విద్యాశాఖ‌
ఏపీ వ్యాప్తంగా 86.69 శాతం స్టూడెంట్స్‌ పాస్
ఇందులో బాలికలు 89.17 శాతం
బాలురు 84.32 శాతం
4.27 లక్షల మందికి ఫస్ట్ క్లాస్
రెసిడెన్షియల్ స్కూళ్లల్లో హ్యాపీ హ్యాపీ
98.43 శాతం రికార్డు
2803 పాఠశాలల్లో 100 శాతం
17 స్కూళ్లల్లో సున్నా శాతం
పార్వతీపురం 87.47 శాతంతో అగ్రస్థానం
శ్రీకాకుళం 84.53 శాతంతో ద్వితీయ స్థానం
79.43 శాతంతో కడప మూడో స్థానం
మే 23 నుంచి సప్లమెంటరీ పరీక్షలు
ఇక ఆన్లైన్‌లోనే రీకౌంటింగ్.. రీ వెరిఫికేషన్

(ఆంధ్రప్రభ , అమరావతి) ఏపీలో విద్యాసంవత్సరం ముగింపునకు ముందే పదో తరగతి ఫ‌లితాల‌ను విద్యాశాఖ సోమ‌వారం విడుదల చేసింది. 2024 విద్యా సంవత్సరంలో నిర్వహించిన టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో బాలికలే సత్తా చాటారు. పార్వతీపురం జిల్లా విద్యార్థులు అత్యధిక శాతంతో టాప్‌లో నిలబడితే.. కర్నూలు జిల్లా విద్యార్థులు ఆఖరి స్థానంలో నిలిచారు. ఇక.. ఇంటర్మీడియెట్ పరీక్ష‌ల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన కృష్ణా, ఎన్టీఆర్, విశాఖ, గుంటూరు జిల్లాల పదో తరగతి విద్యార్థులు కాస్త వెనకబ‌డ్డారు. విశాఖ 8వ స్థానం, కృష్ణా 11వ స్థానం, ఎన్టీఆర్ జిల్లా 14వ స్థానం, గుంటూరు జిల్లా 16 స్థానంలో నిలిచాయి. విద్యాశాఖ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానంద రెడ్డి సోమవారం ప‌దో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేశారు.

బాలికలదే హవా..

ఏపీలో 11,645 పాఠశాలల్లో పదో తరగతి చదివిన 6,16,615 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయగా.. 5,34,574 మంది (86.69 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 84.32 శాతం బాలురు ఉత్తీర్ణులు కాగా , 89.17 శాతం బాలికలు పాస్ అయ్యారు. బాలుర కంటే 4.85 శాతం మంది బాలికలు అధికంగా ఉత్తీర్ణులయ్యారు. బాలురు 3,14, 610 మంది పరీక్షలకు హాజరు కాగా.. 2,65, 267 మంది ఉత్తీర్ణులయ్యారు. 3,02,005 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా. 2,69,307 మంది ఉత్తీర్ణులయ్యారు. 4,27,067 మంది ఫస్ట్ క్లాస్‌లో, 73,200మంది సెకండ్ క్లాస్‌లో, 34,307 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

- Advertisement -

ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లకు ఉత్తీర్ణత కళ..

2803 పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణతను సాధించగా 17 పాఠశాలల్లో సున్నా ఫలితాలు నమోదు అయ్యాయి. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ స్కూళ్లు 98.43 శాతం అత్యధిక ఉత్తీర్ణత సాధించాయి. ఇక జిల్లా పరిషత్ హైసూళ్లు, మున్సిపాలిటీ హైస్కూళ్లు, ప్రభుత్వ సాయంతో నడిచే ఎయిడెడ్ స్కూళ్లల్లో ఫలితాలు పర్వాలేదనిపించినా.. జాబితాలో ఆఖరి స్థానంలో నిలిచాయి.

సప్లమెంటరీకి రెడీ..

ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళ‌న చెందొద్ద‌ని, సప్లమెంటరీ పరీక్షలు రాసుకునే వెసులుబాటు ఉంద‌ని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ప‌రీక్ష‌ల‌న‌ నిర్వహణకు షెడ్యూల్ కూడా ప్రకటించారు. మే 24 నుంచి జూన్ 3 వరకూ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించ‌నున్న‌ట్టు తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌తో సంబంధం లేకుండా సప్లమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి. మే 1వ తేదీ నుంచి మే 23వ తేదీలోపు అపరాద రుసుముతో ఫీజు చెల్లించవచ్చు.

రీకౌంటింగ్.. రీ వెరిఫికేషన్

తక్కువ మార్కులు వచ్చాయనుకునే విద్యార్థులు సబ్జెక్టుల వారీగా రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 23 (మంగళవారం) నుంచి ఏప్రిల్ 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం రీకౌంటింగ్‌కు రూ.500, ప్రతి సబ్జెక్టు రీ వెరిఫికేషన్‌కు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించాలి. తమ దరఖాస్తులను సంబంధిత ప్రధానోపాధ్యాయుడికి సమర్పించాల‌ని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement