Saturday, June 22, 2024

TDP New Slogan – నాలుగేళ్ల న‌ర‌కం – రాష్ట్రం రావ‌ణ కాష్టం …. చంద్ర‌బాబు

అమరావతి: కొత్త ప్రచార కార్యక్రమానికి తెలుగుదేశంపార్టీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలపై ఇది రాష్ట్రమా… రావణ కాష్ఠమా? పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడ‌తూ , రానున్న రోజుల్లో గల్లీ నుండి పట్టణాల వరకు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, వైసీపీ నాయకుల అక్రమాలను ఎత్తి చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడం ఈ ‘నాలుగేళ్ల నరకం’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

ఈ వీడియోలో వరుస దుర్ఘటనలతో నాలుగేళ్ల నరకం అంటూ కొన్ని ఉదంతాలను పేర్కొన్నారు. బాలుడి సజీవ దహనం, ఏలూరులో యాసిడ్ దాడి జరిగినా స్పందనేదీ? అంటూ చంద్రబాబు నిలదీశారు. నెల్లూరు, మచిలీపట్నంలో జరిగిన అత్యాచారాలపై సీఎం మౌనంగా ఉండడానికి కారణమేంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో మహిళను చంపినా ఈ బిడ్డ ఒక్క మాట కూడా మాట్లాడరా? అని మండిపడ్డారు. జగన్ ప్రజల బిడ్డే అయితే దాడులు చేసినవారిని వదిలేస్తారా? జగన్ ప్రజల బిడ్డే అయితే పేదల ప్రాణాలకు వెలకడతారా? అని నిలదీశారు. వరుస ఘటనలు జరిగితే శాంతిభద్రతలపై కనీస సమీక్ష జరపలేదని చంద్రబాబు విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement