Sunday, May 19, 2024

BJP – ఎపి బిజెపికి క‌ట్ట‌ప్ప చంద్ర‌బాబే … సునీల్ దేవ‌ధ‌ర్

విజ‌య‌వాడ – త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల‌లో బిజెపి, జ‌న‌సేన‌, టిడిపిలు క‌ల‌సి పోటీ చేయాల‌ని అనుకుంటున్న త‌రుణంలో క‌మ‌లం కేంద్ర నాయ‌కులు టిడిపి పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు.. రాజ్య‌స‌భ స‌భ్యుడు జివిఎల్ ,ఎపి బిజెపి ఇన్ చార్జి సునీల్ దేవ‌ధ‌ర్ లు చంద్ర‌బాబుని క‌మలం క‌ట్ట‌ప్ప‌గా అభివ‌ర్ణించారు.. విజ‌య‌వాడ‌లో సునీల్ దేవధర్ మీడియాతో మాట్లాడుతూ,. దివంగత ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని, బాహుబలి వంటి ఆయనను కట్టప్ప మాదిరి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఈ విషయాన్ని తాను తొలిసారి చెపుతున్నానని అన్నారు. అలాగే 2014లో బీజేపీతో కలిసి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని… ఆ తర్వాత బీజేపీని క‌ట్ట‌ప్ప‌లా వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్లిపోయారని చెప్పారు. చంద్రబాబు వద్దని జగన్ ను ప్రజలు ఎన్నుకుంటే పరిస్థితి మరింత దిగజారిందని, రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిందని అన్నారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ బాగానే పని చేశారు… ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పటికీ వాస్తవాలను మాట్లాడాలని చెప్పారు. సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని కితాబునిచ్చారు. ప్రజాపోరు యాత్ర ద్వారా పార్టీని వీర్రాజు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని చెప్పారు. ఇప్పుడు పురందేశ్వరి నాయకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ – జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మ‌రో నేత జివిఎల్ మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై ప్ర‌జ‌ల‌లో విశ్వసనీయత లేదని అన్నారు. బిజెపిని న‌ట్టేట ముంచిందే చంద్ర‌బాబు అంటూ ప‌రుషంగామాట్లాడారు. కాగా, పురందేశ్వరి నియామకం ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదని, ఆమెను ఏపీ బీజేపీ చీఫ్ గా ప్రకటించడం ఎంతో దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం అని జీవీఎల్ స్పష్టం చేశారు. త్వరలో బీజేపీ, జనసేన అధికారంలోకి రానున్నాయని వెల్లడించారు. 20 ఎంపీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. టిడిపి పొత్తుపై మీడియా ప్ర‌శ్నించ‌గా, అది త‌మ ప‌రిధిలోది కాదంటూ దాట‌వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement