Sunday, April 28, 2024

SKLM: ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేక ఖాతా తెరవాలి… జిల్లా ఎన్నికల అధికారి

(ప్రభ న్యూస్ బ్యూరో) శ్రీకాకుళం, మార్చి 22 : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు ఖాతాలను తెరవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు సంబంధించి జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో జిల్లాలోని 27ప్రధాన బ్యాంకుల సీనియర్ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జాయింట్ జాయింట్, కలెక్టర్ ఎం.నవీన్ తో కలిసి ఆయన మాట్లాడారు. అభ్యర్థులు తమ పేరున లేదా వారి ఏజెంట్‌ తో పాటు జాయింట్ ఖాతాలను కూడా తెరవవచ్చని తెలిపారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి ఒక రోజు ముందు కూడా ఖాతా తెరవవచ్చని స్పష్టం చేశారు.


బ్యాంకు ఖాతాలు ఏదైనా బ్యాంకు (సహకార బ్యాంకులతో సహా) లేదా పోస్టాఫీసులో కూడా తెరవవచ్చని, అన్ని బ్యాంకులు ప్రత్యేక కౌంటర్‌ను తెరిచి, ప్రాధాన్యతా ప్రాతిపదికన ఖాతాలో డిపాజిట్, ఉపసంహరణలకు వీరికి అనుమతించాలని, అలాగే బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున జరిగే నగదు ఉపసంహరణ లావాదేవీలపై పూర్తిగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బ్యాంకులను ఆదేశించారు. జిల్లాలోని 288 వివిధ బ్యాంకుల శాఖలు ప్రతిరోజూ తమకు సూచించిన ఐదు నివేదికలను నిర్దేశిత సమయంలోగా ఈమెయిల్ ద్వారా చేరవేయాలని స్పష్టం చేశారు.

ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే బ్యాంకులు జిల్లా ఎన్నికల అధికారికి (డీఈవో) సమాచారం ఇవ్వాలని, రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా అయితే అన్ని బ్యాంకులు డీఈవోకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, తదుపరి అవసరమైన చర్యల కోసం తాము ఆదాయపు పన్ను శాఖకు సమాచారాన్ని పంపిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో నగదు రవాణా కోసం ఈఎస్ఎంఎస్ పోర్టల్ నుండి బ్యాంకుల ద్వారా క్యూఆర్ కోడ్ రసీదులు తీసుకుని దానిని నగదు రవాణా చేసే వాహనంతో పాటు వచ్చే అధికారికి అందజేయాలని చెప్పారు.

- Advertisement -

ప్రయాణ సమయంలో, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ లేదా పోలీసు బృందం తనిఖీ కోసం ఆపినప్పుడు క్యూఆర్ కోడ్ రసీదు చూపాలని, తనిఖీ చేస్తున్న సమయంలో రవాణా చేస్తున్న నగదు వివరాలు, క్యూఆర్ రసీదుతో సరిపోలకపోతే నగదు స్వాధీనం చేసుకుంటారని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ ఎం.సూర్య కిరణ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ ఎంవి. తిలక్, డిసిసిబి సీఈవో వరప్రసాద్, గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆర్ఎం రాఘవేంద్ర, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement