Saturday, June 15, 2024

Seat Fight – సత్తెనపల్లిలో సీట్లాట – పొత్తుపై పసుపుసేన పితలాటకం

(ఆంధ్రప్రభ స్మార్ట్, గుంటూరు ప్రతినిధి) – ఏపీలో ఎన్నికల హడావిడి.. వాడీ వేడీ వ్యవహారాలు, అధికార, ప్రతిపక్ష వాదనలను కాసేపు పక్కన పెడితే…పసుపు సేనలో టిక్కెట్ల వాయినాల జాతర ఆసక్తికర రాజకీయాలను తెరమీదకు తీసుకువస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధా పార్టీలు అభ్యర్థులు ఎంపికలో వ్యూహ ప్రతివ్యూహాలతో.. ప్రత్యర్థుల శిబిరాల్లో కలకలం, కలవరం సృష్టిస్తుంటే… ఏపీలో టీడీపీ, జనసేన పార్టీల పొత్తు వ్యవహారంలో కొన్ని సన్నివేశాలు ..అర్రే.. ఇది నిజమా అనే ప్రశ్నలు రేగుతున్నాయి. ఏపీలో 90 మంది టీడీపీ అభ్యర్థుల జాబితాను ఆల్రెడీ పలువురు ఔత్సాహికులు లీకులు మీద లీకులు ఇచ్చారు. అంతే.. తమకే సీటు వస్తుందని భావించిన మరి కొందరు ఔత్సాహికులు బిక్క మొహం వేసి తమ అధినాయకుల అనుచరగణానికి పరిస్థితిని ఏకరవు పెడుతున్నారంటే అతిశయోక్తి కాదు.

గుంటూరు జిల్లాలో జనసేన పార్టీకి రెండు సీట్లు కేటాయిస్తారని జోరుగా ప్రచారం సాగుతున్న తరుణంలో. తెనాలి నియోజకవర్గం సీటును నాదెండ్ల మనోహర్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత తెనాలి టీడీపీ ఇన్ చార్జీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను తెనాలి నుంచి గుంటూరు ఎంపీ స్థానానికి టీడీపీ ప్రమోషన్ ఇచ్చినట్టు సమాచారం. ఇక గుంటూరు వెస్ట్ సీటునూ జనసేనకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా .అధికారికంగా ప్రకటన రాలేదు. రాష్ట్రంలో జిల్లాల విభజన నేపథ్యంలో కొత్త జిల్లాలపైనా జనసేన దృష్టి సారించినట్టు తెలుస్తోంది. గుంటూరు వెస్ట్ ను డీడీపీకి అప్పగించి పల్నాడు జిల్లా సత్తెనపల్లి సీటును కోరేందుకు జనసేన పావులు కదుపుతున్నట్టు సమాచారం.

సత్తెనపల్లి.. సీటుపైనే పితలాటకం

పల్నాడు జిల్లాలో ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జీ మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ కొన్నాళ్లుగా సత్తెనపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలు, నాయకులతో కలిసి మమేకం అయ్యారు. ఇటీవలే సత్తెనపల్లి అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణకే సీటు దక్కినట్టు ప్రచారం ఊపందుకుంది. ఈ స్థితిలో నూతన జిల్లాలు, కులాల సమీకరణ నేపథ్యంలో.. జనసేన సత్తెనపల్లి నియోజకవర్గంపైనే ఎక్కవ ఆశలు పెట్టుకుంది. ఈ మేరకు జనసేన అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం.

- Advertisement -

జనసేనానితో బొర్ర భేటీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని సీట్లు భర్తీ విషయంలో మ ఆయా నియోజకవర్గాల నాయకులతో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో విడివిడిగా ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ అధిష్టానం పిలుపుమేరకు సత్తెనపల్లి జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావును మంగళగిరి పార్టీ కార్యాలయానికి రావాలని పిలుపు వచ్చింది. దీంతో వెంకట అప్పారావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లుగా తెలుస్తోంది. కులాల సమీకరణలు, జనసేన పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశాలు చర్చకు వచ్చినట్లుగా సమాచారం. దీంతో వెంకట అప్పారావుకు సత్తెనపల్లి సీటు ఇస్తారని గుంటూరు, పల్నాడు జిల్లాలో భారీగా చర్చ జరుగుతోంది.

సత్తెనపల్లి జనసేనకే..
జోరుగా ప్రచారం.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్ర వెంకట అప్పారావుతో భేటీ కావటంతో సత్తెనపల్లి సీటు జనసేనకి కేటాయిస్తున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ తో భేటీ సందర్భంలో సత్తెనపల్లి నియోజకవర్గం సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను వివరించారు. జనసేన పార్టీ పోటీ చేస్తే కాపు సామాజిక వర్గం బలంగా ఉండడం కలిసి వచ్చే అంశంగా చెప్పినట్టు తెలుస్తోంది. అప్పారావు కమ్మ సామాజిక వర్గం కావడంతో టీడీపీ నుంచి కూడా ఓట్లు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా వివరించినట్లు సమాచారం. జనసేన పోటీపై స్పష్టమైన హామీ… నియోజకవర్గ స్థితిగతులపై దీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే టీడీపీలో వర్గ పోరు ఉందనే అంశం కూడా ఇరువురు మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. జనసేన పోటీ చేస్తే టీడీపీ సహా రెండు వర్గాలు కలిసి వస్తాయని, జనసేన విజయం సాధిస్తుందని అప్పారావు అధినేత జనసేనకి వివరించినట్లుగా తెలుస్తోంది. వెంకట అప్పారావుకి సత్తెనపల్లి సీటు జనసేన కేటాయిస్తే అతను స్థానికుడిగా… టీడీపీ, జనసేన బలంగా ఉండడం… కులాలు సమీకరణలు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి.జనసేన పోటీ చేయడానికా… లేదా సత్తెనపల్లి రాజకీయ పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ భేటీ నిర్వహించారా అనే అంశంపైనా జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement