Tuesday, April 30, 2024

AP: ఆర్కే యూటర్న్…నారా లోకేష్ ఓటమే లక్ష్యం…

మంగళగిరి, ఫిబ్రవరి 20 (ప్రభ న్యూస్) మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఎమ్మెల్యే పదవికి వైఎస్ఆర్సిపి కి రాజీనామా చేసిన విషయం విదితమే. రాజీనామా అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల తోనే తన రాజకీయ ప్రయాణం అని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిరోజులు అనంతరం తాజాగా ఆయన యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నేడు ఎమ్మెల్యే ఆర్కే సి ఎం ఓ కు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తిరిగి వై ఎస్ ఆర్సీపీ లో చేరటం ఖాయమైంది.

లోకేష్ ను ఓడించటమే లక్ష్యం…ఆర్కే
లోకేష్ ను ఓడించటమే లక్ష్యం అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.పెద్దకాకానిలో ఆయనను మంగళవారం కలిసిన కార్యకర్తలను ఉద్దేశించి తెలిపారు.సిఎం ఆదేశాల మేరకు పని చేస్తానన్నారు.

బీసీలకు ఇచ్చిన మాట తప్పుతారా?
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన రోజు మంగళగిరి సీటును బీసీలకు కేటాయిస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. అదే రోజు బిసి పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి వైఎస్ఆర్సిపి మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పదవిని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కొద్దిరోజుల తర్వాత వైఎస్ఆర్సిపి అధిష్టానం విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు జాబితా తొలి లిస్టులో చిరంజీవి పేరు ఉంది. ఇటీవల చిరంజీవి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నారని ప్రచారం జరుగుతోంది. మాటిచ్చిన ప్రకారం ఎవరో ఒక బీసీ అభ్యర్థిని బరిలో దింపుతారని అందరూ ఊహిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఆర్కే తెరపైకి రావటం మంగళగిరిలోని కొందరు నేతల్లో అలజడి రేపుతోంది. బీసీలకు ఇచ్చిన మాటను విరమించుకొని వైఎస్ఆర్సిపి అధిష్టానం ఆర్కే కు సీటు కేటాయిస్తుందా లేదా ఆర్కేకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరి ఏదైనా నియోజకవర్గాన్ని కేటాయిస్తుందా లేదా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తుందా అన్నది తేలాల్సి ఉంది.నారా లోకేష్ ఓటమి లక్ష్యం గా అధిష్ఠానం నిర్ణయం ఉంటుందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement