Monday, April 29, 2024

Big Story: జ‌గ‌న్‌పై ర‌ఘురామ గ్రేట్ స్కెచ్‌.. ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు..

సీఎం జ‌గ‌న్ మీద ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల స‌ర్వేల్లో వెల్ల‌డైంది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే తెలుగుదేశం పార్టీకి 130 స్థానాల దాకా వ‌స్తాయ‌ని ఆ పార్టీ అంచ‌నా వేసుకుంటోంది. అయితే ఇండియ‌న్‌ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్‌ ప్ర‌శాంత్ కిషోర్ ఈ మ‌ధ్య కాలంలో చేసిన స‌ర్వేలో కూడా అట్లాంటి రిపోర్టే వ‌చ్చింద‌ని టీడీపీ సోష‌ల్ మీడియా న‌మ్మ‌కంగా ఉంది. ఆ మేర‌కు స‌ర్వే వివ‌రాల‌ను పోస్టు చేసింది. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘ‌రామ‌క్రిష్ణంరాజు కూడా ఆ స‌ర్వేల‌ను న‌మ్ముతున్నాడు. టీడీపీకి ద‌గ్గ‌ర‌గా ఉన్నాడు. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితికి అండ‌గా నిలిచారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలోనే ఉండాల‌ని జ‌రిగిన న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం మ‌హాపాద‌యాత్ర ముగింపు స‌భ‌కు కూడా ర‌ఘురామ‌ హాజ‌ర‌య్యారు. ప్ర‌తిప‌క్షం కంటే బ‌లంగా జ‌గ‌న్ మీద తిర‌గ‌బ‌డిన ఎంపీ ర‌ఘ‌రామ ప్ర‌భావం ఏపీ ప్ర‌భుత్వంపై చాలా ఉంది. రోజూ ర‌చ్చబండ ద్వారా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏపీ స‌ర్కార్ పై యుద్ధం చేస్తున్నాడు ర‌ఘురామ‌. వైసీపీ రెబ‌ల్ ఎంపీగా లోక్ స‌భ‌లోనూ ఆయ‌న జ‌గ‌న్ స‌ర్కార్ వ్య‌తిరేక ధోర‌ణ‌ని వినిపించాడు. త‌న‌దైన శైలిలో వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద పోరాటమే చేస్తున్నాడు.

ఇటీవ‌ల ఎంపీ ర‌ఘురామ బీజేపీలో చేర‌తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలుగుదేశం గూటికి చేర‌తాడ‌ని మ‌రో చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. వీట‌న్నింటికీ చెక్ పెట్టేలా ఉప ఎన్నిక కోసం సిద్ధ‌మంటూ స‌వాల్ చేశాడు ర‌ఘురామ‌. న‌ర్సాపురం వైసీపీ ఎంపీగా ర‌ఘురామ‌క్రిష్ణంరాజు ఉన్నాడు. నిత్యం ఏపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నాడు. దీంతో ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని లోక్ స‌భ స్పీక‌ర్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏడాది కాలంగా ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయించాల‌ని ఢిల్లీ వేదిక‌గా స‌ర్వ‌శ‌క్తులు జ‌గ‌న్ అండ్ టీం ఒడ్డుతోంది. కానీ, ఆక‌స్మాత్తుగా రివ‌ర్స్ అస్త్రాన్ని ర‌ఘురామ సంధిస్తున్నాడు. సంక్రాంతి పండుగ తర్వాత లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. అమరావతి ఎజెండాతో ఎన్నికల్లో తిరిగి పోటీ చేయడానికి సిద్ధమ‌ని స‌వాల్ విసిరాడు. జ‌గ‌న్ స‌ర్కార్ పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను నిరూపించ‌డానికి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి రెడీ అయ్యాడు.

వంద రోజుల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటాన‌ని జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చాడు. కానీ, కోవిడ్ కార‌ణంగా ఆయ‌న పాల‌న అనుకున్నంత స్పీడ్ గా సాగ‌లేదు. పైగా మూడు రాజ‌ధానుల ఇష్యూ కూడా గంద‌ర‌గోళంగా మారింది. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌, రైతుల బోరు బావుల‌కు మీట‌ర్లు అమ‌ర్చ‌డం, మ‌ద్యం, ఇసుక పాల‌సీలు, న‌వ‌ర‌త్నాల్లోని లోపాలు, పెరిగిన అవినీతి.. ఇవ‌న్నీ ప్ర‌జా వ్య‌తిరేక‌త‌కు కార‌ణాలుగా ప్ర‌త్య‌ర్థులు భావిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల‌న్నీ జ‌గ‌న్ కు అనుకూలంగా ఉండ‌డంతో పాల‌న భేష్ అంటూ వైసీపీ భావిస్తోంది. ఆ భావ‌న త‌ప్ప‌ని నిరూపించ‌డానికి ర‌ఘురామ ఉప ఎన్నిక‌ల బ‌రిలోకి మ‌ళ్లీ దిగ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

ఒక వేళ ర‌ఘురామ‌ విజ‌యం సాధిస్తే, 2024 ఎన్నిక‌ల్లో వైసీపీపై తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది. అమ‌రావ‌తి రాజ‌ధాని ఎజెండాతో వెళ్లాల‌ని రఘురామ‌ భావిస్తున్నాడు. ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల మాదిరిగా రాజ‌ధాని, 2024 ఫ‌లితాల‌కు ర‌ఘురామ ముందే బ్లూప్రింట్ ర‌చించ‌డానికి స్కెచ్ వేశాడు. మొత్తం మీద వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘ‌రామ‌క్రిష్ణంరాజు చేసిన రాజీనామా ప్ర‌క‌ట‌న‌తో వ‌ణికించే వింట‌ర్‌లోనూ ఏపీలో రాజ‌కీయ హీట్ ఒక్క‌సారిగా పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement