Tuesday, June 25, 2024

AP | మఠాల ఆస్తులకు రక్షణ..! అన్యాక్రాంతమైన భూముల స్వాధీనం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని మఠాలు, సత్రం భూముల కబ్జాపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. అన్యాక్రాంతంలోని మఠాలు, సత్రాలు, వేద పాఠశాలల భూముల వివరాలు సేకరించడం..ఆపై వాటిని స్వాధీనం చేసుకొని ఎండోమెంట్‌ రిజిస్టర్‌లో నమోదు చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే అన్యాక్రాంతంలోని రూ.1,500 కోట్ల విలువైన భూములను దేవదాయశాఖ స్వాధీనం చేసుకుంది. ఇదే క్రమంలో మరికొన్ని ఆస్తుల స్వాధీనంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో దేవదాయశాఖ కింద 130 మఠాలు, 1,891 సత్రాలు ఉన్నాయి.

గతంలో దాతలు వీటి నిర్వహణ కోసం వేలాది ఎకరాలు ఇనాంగా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మఠాల భూములు ఉన్నాయి. ఇదే క్రమంలో విద్య, వైద్యం, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకొని దాతలు పెద్ద ఎత్తున ముందుకొచ్చి సత్రాలు నిర్మించారు. సత్రాల నిర్వహణలో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూములు, భవనాలు సమకూర్చారు. తద్వారా వచ్చే ఆదాయాలతో దాతల ఆశయం నెరవేర్చాల్సి ఉంది.

- Advertisement -

అధికారుల నిర్లక్ష్యం.. అనేక చోట్ల అవినీతి కారణాలతో వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. కొన్ని భూములు రికార్డుల నుంచే మాయం కాగా..మరికొన్ని భూములు వేర్వేరు వ్యక్తుల కబ్జాల్లో ఉన్నాయి. గతంలో వీటిని స్వాధీనం చేసుకునేందుకు చట్టపరమైన అడ్డంకులను దృష్టిలో ఉంచుకొని జగన్మోహన రెడ్డి ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. లీజు కాల పరిమితి ముగిసినా..లీజు సొమ్ము సకాలంలో చెల్లించకపోయినా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చట్టానికి సవరణలు చేసింది. వారం రోజుల వ్యవధితో నోటీసులు జారీ చేసి భూములు స్వాధీనం చేసుకునే అధికారం కార్యనిర్వహణాధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం చట్టానికి సవరణలు చేసింది.

అన్యాక్రాంత భూముల స్వాధీనం..

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం దేవాదాయశాఖ చట్టంలో పలు సవరణలు చేసింది. దేవదాయశాఖకు చెందిన ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చింది. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకునే అధికారాలను కార్యనిర్వహణాధికారులకే అప్పగించారు. అవసరమైతే పోలీసు అధికారుల సాయంతో వీటిని స్వాధీనం చేసుకుని కబ్జాకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు సైతం చట్టంలో అవకాశాలు కలిపించారు. ఇందులో భాగంగా తొలి విడతలో అన్యాక్రాంతమైన భూములను గుర్తించే పని చేపట్టారు. మఠాలు, సత్రాలకు చెందిన భూములు ఎక్కడెక్కడ? ఎన్ని ఉన్నాయి? అనే వివరాలు సేకరించడంతో పాటు కబ్జా భూములను గుర్తించే ప్రక్రియను అధికారులు చేపట్టారు.

ఇందులో భాగంగా ఇప్పటికే వేర్వేరు ప్రాంతాల్లో రూ.1,500 కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెపుతున్నారు. ఇప్పటికే గుర్తించిన మరికొన్ని భూములను కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని పక్కాగా దేవాదాయశాఖ రిజిస్టర్‌ (45)లో నమోదుకు చర్యలు తీసుకోనున్నారు. భూముల వివరాలను ఆన్‌లైన్‌ కూడా చేస్తున్న నేపధ్యంలో రానున్న రోజుల్లో అన్యాక్రాంతమయ్యే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు.

అధికారులే అసలు సమస్య..

రాష్ట్రంలోని దేవా ొదాయశాఖ పరిధిలోని మఠాలు, సత్రాలు, వేద పాఠశాలల భూముల అన్యాక్రాంతం అయ్యేందుకు అధికారులే అసలు సూత్రధారులుగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలోని హథీరాంజీ మఠం ఆస్తులు పెద్ద ఎత్తున అన్యాక్రాంతమైనట్లు ఇటీవల ప్రభుత్వ విచారణలో తేలింది. పలు చోట్ల లీజుల పేరిట కబ్జా కోరల్లో చిక్కుకోగా..అనేక ఆస్తులు రికార్డుల నుంచే మాయమైనట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు బాధ్యునిగా హథీరాంజీ మఠం మహంతు అర్జున్‌ దాస్‌ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ప్రస్తుతం ఈ వివాదం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఉంది.

గతంలో విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో ఒక ధార్మిక సంస్థకు చెందిన ఆస్తుల అన్యాక్రాంతాన్ని దేవదాయశాఖ అధికారులు పసిగట్టి అడ్డుకున్నారు. రూ.200 కోట్ల విలువైన ఆస్తులను ఏ విధమైన పత్రాలు లేకుండానే ప్రైవేటు వ్యక్తులకు చెందినవిగా పేర్కొంటూ దేవదాయశాఖ ఉన్నతాధికారులకు క్షేత్రస్థాయి అధికారులు నివేదిక ఇచ్చారు. అనుమానంతో ప్రధాన కార్యాలయం అధికారులు విచారణ జరపగా అవన్నీ ఒక దాత ఇచ్చిన ట్రస్టు భూములుగా గుర్తించి సంబంధిత అధికారిని సస్పెండ్‌ చేశారు. రాష్ట్రంలోని మన్సాస్‌ ట్రస్టు భూముల అన్యాక్రాంతం అప్పట్లో పెద్ద దుమారమే లేపింది. జిల్లాల్లో అనేక మంది కార్యనిర్వహణాధికారులు కబ్జాదారులతో కుమ్మక్కై దాతల ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement