Wednesday, May 1, 2024

Congress: ష‌ర్మిల కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు… ఇది నియంతృత్వ పాల‌నే అంటూ ఫైర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని చూసి జగన్ సర్కార్ భయపడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో త‌న కాన్వాయ్ ఆపడంపై షర్మిల మండిపడ్డారు.పిసిసి అధ్య‌క్ష‌రాలిగా భాద్య‌త‌లు స్వీక‌రించేందుకు గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి విజ‌య‌వాడ‌కు వెళుతున్న వైఎస్ షర్మిల కాన్వాయ్‌ను ఎనికేపాడు వద్ద పోలీసులు ఆపారు. అక్కడి నుంచి వాహనాలను మళ్లించారు.

వెహికిల్స్ డైవర్ట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు రోడ్డు మీద బైఠాయించారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెనక ఉన్న వాహనాలు వచ్చేవరకుతాను ముందుకు వెళ్లేది లేద‌నిషర్మిల పోలీసుల‌కు తేల్చిచెప్పారు. దీంతొ జాతీయ ర‌హ‌దారిపై భారీగా వాహ‌నాలు నిలిచిపోయాయి. ఆ వెంట‌నే పోలీసులు షర్మిల వద్దకొచ్చి మాట్లాడారు. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో పోలీసులు దిగొచ్చారు. చ‌ర్చ‌ల అనంత‌రం షర్మిల కాన్వాయ్‌కు అనుమతి ఇచ్చారు. అక్క‌డి నుంచి ఆమె విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర‌ర‌త్న భ‌వ‌న్ కు చేరుకున్నారు.. ఈ సంద‌ర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజన్న బిడ్డ ఎవరికీ భయపడదని తేల్చిచెప్పారు. అనుమతి తీసుకొని వెళ్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని అడిగారు. ఎపిలో జ‌గ‌న్ నియంత పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement