Friday, May 17, 2024

జగన్ మొద్దునిద్ర వీడాలి : ఎమ్మెల్యే వేగుళ్ళ

కేంద్రం పెట్రోల్ పై ధరలు తగ్గించగా ఇతర రాష్ట్రాలు సైతం తమ పన్నులు తగిస్తే ముఖ్యమంత్రి జగన్ వీటిని పరిగణనలోకి తీసుకోకుండా మొద్దు నిద్ర పోతున్నారని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని కోరుతూ మండపేట టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం మండపేట పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ… పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల వల్ల మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెంచిన ధరలు తక్షణమే తగ్గించాలని కోరారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తానన్న సీఎం జగన్.. 36 రూపాయల వ్యాట్ వసూలు చేస్తూ మాట తప్పారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ పై పన్నుల రూపంలో గత రెండున్నరేళ్లలో రూ.28 వేల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు.

రోడ్ డెవలప్ మెంట్ సెస్ పేరిట లీటర్ కు అదనంగా మరో రూపాయి వసూలు చేయడాన్ని తప్పు పట్టారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటి తగ్గించడంతో 23 రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయన్నారు. పెట్రోల్ పై లీటర్ కు రూ. 16 లు, డీజిల్ పై రూ.17 లు తగ్గించాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుందని విమర్శించారు. జగన్ అవినీతి, దుబారా, చేతకాని పరిపాలన విధానాలతోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండవన్నారు. అధిక డీజిల్ కారణంగా రైతులపై భారం పడుతుందన్నారు. దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ధర ఏపీలోనే ఉందన్నారు. తొలుత మండపేట రథం వద్ద గల టీడీపీ కార్యాలయం నుండి మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కెపి రోడ్ కాలవ పువ్వు సెంటర్ ల నుండి కరాచీ సెంటర్ కు చేరుకున్నారు. అక్కడ ఎన్ టి ఆర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి బస్ స్టాండ్, రాజరత్న సెంటర్ట్ నుండి రవి కాంత్ బంక్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ధర్నా నిర్వహించారు. అక్కడి నుండి వివి ఎస్ ఎస్ చౌదరి బంక్, బైపాస్ లోని పెట్రోలు బంకుల వద్ద ధర్నా నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ ఘటన లు చోటు చేసుకోకుండా రూరల్ సి ఐ పెద్దిరెడ్డి శివ గణేష్ నేతృత్వంలో టౌన్ ఎస్ ఐ బి రాజేష్ కుమార్ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, టీడీపీ నాయకులు గడి రాంబాబు, చింతలపూడి సత్తిబాబు, సిరంగు ఈశ్వర్, పడాల బాబీ, చిలుకూరు బాపిరాజు, బొడ్డు రామకృష్ణ, వాదా ప్రసాద్ రావు, చుండ్రు చిన చౌదరి, మందపల్లి దొరబాబు, మేడింటి సూర్య ప్రకాష్, యారమాటి గంగరాజు, గుండు తాతరాజు, జొన్నపల్లి సూర్యారావు, అవసరాల వీర్రాజు, కాళ్ళకురి శ్రీనివాస్, వార్డు ఇన్ ఛార్జ్ లు, నాయకులు కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement