Monday, April 29, 2024

తెనాలి జనసేన అభ్యర్దిగా నాదెండ్ల మనోహర్‌.. ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌

అమరావతి,ఆంధ్రప్రభ: రానున్న శాసనసభ ఎన్నికలకు జనసేన తరపున తొలి అభ్యర్ధిగా నాదెండ్ల మనోహర్‌ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. తెనాలి నుంచి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పోటీ చేస్తారని ఆ నియోజకవర్గ నేతలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రకటించారు. తెనాలిలో జనసేన జెండా కచ్చితంగా ఎగురుతుందని పవన్‌ కళ్యాణ్‌ విశ్వాసాన్ని వెలిబుచ్చారు. గతంలోనూ తెనాలి శాసనసభ్యుడిగా ఆ నియోజకవర్గానికి ఎంతో సేవ చేసిన మనోహర్‌ను ఈసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి నాదెండ్ల మనోహర్‌ లాంటి నేతలు అసెంబ్లిdకి పంపించాల్సిన అవసరం ఉందని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. కాగా తెనాలి నియోజకవర్గం నుండి ఇప్పటికే రెండుసార్లు మనోహర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడోసారి కూడా విజయం సాధించడంపై కన్నేశారు.

- Advertisement -

తెనాలిలో పెరిగిన జనసేన బలం

గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నాదెండ్ల మనోహర్‌కు ఆ నియోజకవర్గం లోని ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికల్లోనూ జనసేన తరుపున మనోహర్‌ పోటీ చేయగా ప్రతికూల వాతావరణంలో సైతం 15 శాతం ఓట్లు తెచ్చుకోగలిగారు. ఇదే నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 23 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం చూస్తే జనసేనకు తెనాలి నియోజకవర్గం పట్టున్న నియోజకవర్గంగానే ఉంది. పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవి ఛరిస్మా తోపాటు స్థానికంగా మనోహర్‌కు ప్రజల్లో ఉన్న పలుకుబడి ఈసారి గట్టిపోటీ ఇచ్చే స్థితికి చేర్చాయి.

నాలుగేళ్ల నుంచి నాదెండ్ల మనోహర్‌ నిత్యం నియోజకవర్గ ప్రజలతో మమేకం అయ్యారు. జనసేన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు నిత్యం వెంటుండి స్ఫూర్తి నిచ్చారు. చనిపోయిన జనసేన క్రీయాశీలక కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయల భీమాను అందించారు. అదేవిధంగా నష్టపోయిన రైతులకు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలబడ్డారు. దీనికితోడు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పైన చాలా వ్యతిరేకత ఉంది. సొంత పార్టీ నేతలే ఆయన్ను వ్యతిరికస్తున్నారు.

గ్రామాల్లో నాయకులంతా గ్రూపుల వారీగా విడిపోయారు. అలా అసంతృప్తిలో ఉన్న నేతలు మనోహర్‌ వైపు చూస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రోజు రోజుకూ తెనాలిలో జనసేన బలపడుతుండగా మరోవైపు టిడిపితో పొత్తు కుదిరితే ఇక మనోహర్‌ విజయం నల్లేరు మీద నడకే అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. కాగా టిడిపి తరపున గతంలో ఇక్కడ పోటీ చేసిన అలపాటి రాజా ప్రస్తుతానికి తాను ఇక్కడే పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పొత్తులు ఖరారు అయితే ఆయన గుంటూరు 2కు వెళ్ల్తారనే ప్రచారం కూడా సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement