Sunday, December 4, 2022

పిచ్చి పీక్స్‌కి చేరింది.. పది రోజుల్లో చనిపోతా, మూడురోజుల్లో తిరిగొస్తా అంటున్న పాస్ట‌ర్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానం పరుగులు పెడుతుంటే.. మరోవైపు విఙ్ఞాన రంగంలో దేశం నింగిలోకి దూసుకెళ్తుంటే.. ఇంకా మూఢ నమ్మకాలను పట్టుకుని కొంత‌మంది వేలాడుతూనే ఉన్నారు. మత విశ్వాసాలు మనిషిలో మంచిని పెంచాలేగాని మూఢత్వం వైపు నడిపించరాదని జన విఙ్ఞాన వేదిక వంటి సంఘాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. తాజాగా ఓ పాస్టర్‌ విచిత్ర వాదన అందరినీ పరేషాన్‌కు గురిచేస్తోంది. తాను పది రోజుల్లో చనిపోయి.. సమాధి నుంచి మూడో రోజు తిరిగి వస్తానని చెప్పడం వింత అనిపించినా నమ్మకం పరాకాష్ఠకు చేరుకుందని అంటున్నారు జనం. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
   

కృష్ణాజిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లికి చెందిన పాస్టర్‌ పులపాక నాగభూషణం చనిపోయినా తిరిగొస్తాడనే ప్రచారం జరుగుతోంది. సియోను బ్లెస్సింగ్‌ మినిస్ట్రీస్‌ పేరుతో చర్చి నిర్వహిస్తున్న ఆయన చనిపోయి మూడు రోజుల తర్వాత లేస్తానంటూ సంఘస్తులతో అంటున్నాడు. నాగభూషణం తన సమాధికి స్థలం కూడా సిద్ధం చేసుకోవడం మరింత విస్మయం కలుగచేస్తోంది. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు స్ధానికులు చెబుతున్నారు. నాగభూషణం తాను చనిపోతున్నానంటూ గ్రామంలో ప్లెక్సీ కూడా వెలిసింది.

గొల్లనపల్లిలోని తన స్థలంలో సమాధి కోసం గొయ్యిని కూడా తవ్వించుకుని తాను చనిపోతే ఇదే సమాధిలో పెట్టాలని మూడు రోజుల్లో తిరిగి వస్తానని అందరికీ చెప్పడం పట్ల అటు కుటుంబ సభ్యులు, ఇటు గ్రామస్తులు కంగారు పడుతున్నారు. గతంలో పాస్టర్‌ నాగభూషణం వెటర్నరీ అ-టె-ండర్‌గా పనిచేశారు. సోషల్‌ మీడియాలో నాగభూషణం వింత ప్లెnక్సీలు హల్‌ చల్‌ కావడంతో ఆయన బంధువులు గొల్లంపల్లి గ్రామానికి చేరుకున్నారు. నాగభూషణం ఎక్కడ సజీవ సమాధి చేసుకుంటాడోనని బంధువులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న గన్నవరం పోలీసులు గొల్లనపల్లి గ్రామానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.

ఎమ్మార్సో కౌన్సిలింగ్‌..
సమాధి నుంచి లేచొస్తానంటూ హడావుడి చేసిన పాస్టర్‌ నాగభూషణానికి గన్నవరం ఎమ్మార్వో నరసింహారావు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. పాస్టర్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి ప్లెnక్సీ డిజైన్‌ చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవుడి పేరుతో మూఢ నమ్మకాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని ఎమ్మార్వో హెచ్చరించారు. అయినా పరలోకంలో దేవుడు పిలిచాడని ఇలా వెళ్లి అలా తిరిగొచ్చేస్తానని గుడ్డిగా వాదిస్తున్నాడు. పైపైన ప్రార్థనలు చేసే వాళ్లకి దేవుడంటే ఏం తెలుసని, సంపూర్ణంగా ప్రార్థనలు చేసే తనకు దేవుడు కనిపిస్తాడు, వినిపిస్తాడనే చెబుతున్నాడు. ఏదైమైనా పాస్టర్‌ వ్యవహారంపై పోలీసులు నిఘా ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement