Sunday, June 16, 2024

గుట్కా జాదూగాళ్లు.. చిక్కరు, దొరకరు.. కర్నాటక నుంచి కర్నూలుకు స‌ప్ల‌య్‌

కర్నూలు, (ప్రభ న్యూస్‌ బ్యూరో): జిల్లాలోనిషేధిత గుట్కా వ్యాపారం గుట్టుగా సాగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గుట్కాల నిషేధం అమలు చేస్తున్నప్పటికీ కొందరు అక్రమార్కులు మాఫియాను తలపించే విధంగా గుట్కా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. మాఫియా ఎత్తులు వేస్తూ నిషేధిత గుట్కాను జిల్లాలోని పట్టణాలతోపాటు మండలాలు, గ్రామాలలోని కిరాణం షాపులు, పాన్‌ డబ్బాలకు చేరవేస్తున్నారు. చైన్‌ సిస్టంలో గుట్కా దందా నడుస్తోంది. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్ర నుంచి వాహనాల ద్వారా రాష్ట్రంలోకి వస్తుంది. వాహనాల్లో అడుగు భాగంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు పైన నిత్యావసర సరుకులు, కూరగాయలు వేస్తూ, కొందరు కార్లలో జిల్లాకు తీసుకొస్తున్నారు.

ఇలా తీసుకు వచ్చిన సరుకును వీరి దగ్గర నుంచి ఒక ప్రాంతాన్ని బట్టి మరొక దళారీ కొనుగోలు చేస్తారు. అతను ఆ మండలంలోని ఒక్కరు, ఇద్దరు ఏజెంట్లను పెట్టుకుంటాడు. వారు రిటైల్ (కిరాణం షాపులు, పాన్‌డబ్బాలు)గా లక్ష్యంగా పెట్టుకొని అక్కడికి చేరవేస్తారు. చైన్‌ సిస్టంలో ఉన్న వారెవ్వరు పోలీస్‌లకు చిక్కరు. కొంత మంది ఏజెంట్‌లు స్నేహం పేరుతో యువతను మద్యానికి బానిసలుగా మార్చి దందాలో వాడుకుంటున్నారు. జిల్లా పోలీస్‌లు గుట్కా ఏజెంట్లపై నిఘా పెట్టి దాడులు చేస్తుండడంతో అప్పుడప్పుడు కేసులు నమోదవుతున్నాయి.

జిల్లాలో నెల టర్నోవర్‌ రూ.40 కోట్ల పైమాటే..

జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం నెలకు రూ. 40 కోట్లకు పైగానే ఉంటుంది. గుట్కా నమిలేవారి అభిరుచి ఆధారంగా సుమారు 10 పేర్లతో సాధారణ గుట్కా, పాన్‌మసాలా గుట్కా,రెండు ప్యాకెట్‌లను కలిపి తింటారు. ఈ ప్యాకెట్‌ మీద ధర రూ.9, కొన్నింటి మీద రూ.10 వరకు ఉంటుంది. దళారి వద్దకు వచ్చే సరికి రూ. 5, ఏజెంట్‌ వద్దకు వచ్చే సరికి 8, రి-టైల్‌గా వచ్చే సరికి రూ.12 ఉండగా, గుట్కా నమిలేవారి దగ్గరికి వచ్చేసరికి రూ.20 నుంచి రూ.40 వరకు ధర ఉంటుంది. పోలీసుల నిఘా నేపథ్యంలో వీటి ధరలు దళారి, ఏజెంట్లు- అమాంతంగా పెంచారు. రి-టైల్‌గా ప్యాకెట్‌కు రూ. 40నుంచి రూ.50వరకు అమ్మకం చేస్తున్నారు. ప్రతి మండలంలోని ఏజెంట్ల దందా నెలకు రూ.12లక్షలు ఉండగా, ఇతర రాష్ట్రాల్ర నుంచి నుంచి తెచ్చుకునే వారిది మరో రూ.20 లక్షల వరకు ఉంటుంది. జిల్లాలో ఆత్మకూరు, శ్రీశైలం, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, నంద్యాల, వెల్దుర్తి, డోన్ , బేతంచర్ల, బనగానపల్లె, మహానంది, గాజులపల్లె, హోళగుంద, కౌతాళం, కోడుమూరు తదితర మండలాల్లో వీటి అమ్మకం చిన్న మండలంలో కంటే రెట్టింపు ఉంటుంది. పోలీసుల తనిఖీల నేపథ్యంలో నిషేధిత గుట్కా కొరతను చూపుతూ అధిక ధరలు అమ్ముతుండడంతో నెల టర్నోవర్‌, లాభం రెట్టింపు అయ్యిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యాపారి తెలిపాడు.

కర్ణాటక నుంచి కర్నూలు వరకు..

- Advertisement -

కర్నూలు జిల్లాలో గుట్కా వ్యాపారం పంచతంత్రం దందాదారుల కనుసన్నల్లో గుట్టుగా నడుస్తోందని ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు నగరం కు చెందిన ఓ వ్యక్తి గుట్కా దళారి, ఏజెంట్‌గా నంద్యాల, ఆదోని, చుట్టు పక్కల మండలాల్లోని ఏజెంట్లకు, అక్కడినుంచి జిల్లాలోని అన్ని గ్రామాలకు అమ్మకం చేస్తాడు. కోయిలకుంట్ల కు చెందిన మరో ఏజెంట్‌ బనగానపల్లె, సంజామల, అవుకు, బేతంచర్ల పరిసర పరిధిలోని కొన్ని గ్రామాలకు చేరవేస్తున్నారు. అదేవిధంగా డోన్‌ మండలానికి చెందిన మరో ఏజెంట్‌ ఆయా పరీసర పరిధిలోని మండలాలకు, కొన్ని గ్రామాల్లో నిషేధిత గుట్కా దందా నిర్వహస్తున్నారు.

కొన్ని నెలలుగా నమోదైన కేసులు..

1.కర్నూలు శివారులో పట్టు-కున్నారు. హైదరాబాద్‌ వైపు నుంచి గుట్కా సరకుతో బొలెరో వాహనం కర్నూలు వైపు వస్తున్నట్లు- స్పెషల్‌ బ్రాంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు రెండు బృందాలుగా ఏర్పడి హైవేలో కాపు కాశారు. ఓ బృందం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఉండవల్లిలో, మరో బృందం రాష్ట్ర సరిహద్దులో ఉండగా బొలెరో వాహనం వచ్చింది. పోలీసులు వెంబడించి నగర శివారులో పట్టుకున్నారు.

2.ఆదోని పట్టణంలో ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భారీగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పెద్ద మసీదు సమీపంలో ఓ వాహనంలో ఉంచిన గుట్కా ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.35లక్షల వరకు చేస్తుందని ఆదోని డీఎ స్పీ వినోద్‌కుమార్‌ తెలిపారు. నిందితులు ఖలీల్‌ అహ్మద్‌, ఖుషీ అహ్మద్‌, జుబేర్‌, రహమాన్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

3.కోవెలకుంట్ల కేంద్రంగా నిషేధిత గుట్కా వ్యాపారం చేస్తున్న నూకల మనోహర్‌పై పీడీయాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. కలుగొట్ల గ్రామానికి చెందిన మనోహర్‌ కొన్నేళ్ల నుంచి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్రకు చెందిన పలువురు వ్యక్తులతో కలిసి గుట్కా వ్యాపారం చేస్తున్నాడు. జిల్లాలోని ఆళ్లగడ్డ, శిరివెళ్ల, నంద్యాల, బనగానపల్లె, కొలిమిగుండ్ల తదితర ప్రాంతాలకు గుట్కా ప్యాకెట్లను సరఫరా చేసేవాడు. అతనిపై 14 కేసులు నమోదయ్యాయి. ఇందులో కోవెలకుంట్ల పోలీస్‌స్టేషన్‌లో ఎనిమిది, ఆళ్లగడ్డ పీఎస్‌లో మూడు, ఆళ్లగడ్డ రూరల్‌, శిరివెళ్ల, నంద్యాల తాలూకా స్టేషన్లలో ఒక్కొక్క కేసు ఉన్నాయి.ఈ కేసుల్లో పలుమార్లు అరెస్టయ్యి.. జైలుకు కూడా వెళ్లొచ్చినా నేర ప్రవృత్తిని మాత్రం మార్చుకోలేదు. 3 నెలల క్రితం రూ.60 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి తెస్తూ స్పెషల్‌ పార్టీ పోలీసులకు పట్టు-బడ్డాడు. అతని గుట్కా వ్యాపారాన్ని సీరియస్‌గా పరిగణించిన పోలీసులు పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేసి చేశారు.

వెలుగోడులో గుట్టు-చప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకు ఏకంగా ఇతర రాష్ట్రాల్ర వారితోనే సంబంధాలున్నాయని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు గుట్కా విక్రయాలపై దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు. కర్నూలులోని చిత్తారిగేరి వీధికి చెందిన షేక్‌ అక్బర్‌ బాషా కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలోని మోహిమ్‌ వీధి, రాయచూరులోని గణేష్‌ ట్రేడర్స్‌ నుండి నిషేధించిన గుట్కాను కొనుగోలు చేసి పగిడ్యాల మండలం ప్రాతకోటకు చెందిన హాజిభాషా, నందికొట్కూరు సాయిబాబా నగర్‌కు చెందిన మహబూబ్‌ బాషా, సర్దార్‌ బేగ్‌లకు విక్రయించినట్లు చెప్పారు.వీరి ద్వారా వెలుగోడు పట్టణంలోని గాంధీనగర్‌ వీధికి చెందిన ఇంతియాజ్‌, సుధాకర్‌లకు విక్రయించే వారు. సమాచారం మేరకు వెలుగోడులో నందికొట్కూరుకు వెళ్లే మార్గంలో వాహనాల తనిఖీలు చేపట్టగా ఇన్నోవా వాహనంలో రూ. 2 లక్షల 50 వేలు, రూ. 3,31,500 విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement