Thursday, May 2, 2024

Nijam Gelawali – జగన్ పాలనపై ప్రజల తిరుగుబాటు తప్పదు – నారా భువనేశ్వరి

పరిశ్రమలు లేవు
గంజాయి మాఫియా దిగింది
కల్తీ మద్యం రాజ్యమేలుతోంది
అడ్డగోలు పన్నులతో జనం జేబులు ఖాళీ
పెన్షన్లు ఇవ్వలేక చంద్రబాబుపై అపవాదులు
ఈ దుర్మార్గ పాలనపై తిరుగుబాటు తప్పదు
నంద్యాలలో నారా భువనేశ్వరి

( ఆంధ్రప్రభ స్మార్ట్, నంద్యాల ప్రతినిధి) – వైసీపీ ప్రభుత్వం తమ వైఫల్యాలను చంద్రబాబుకు ఆపాదిస్తుస్తోందని , పెన్షన్లు ఇవ్వడం చేతకాక చంద్రబాబు పెన్షన్లు నిలిపేశారని విష ప్రచారం చేస్తున్నారని నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఆమె స్పష్టం చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం నంద్యాల నియోజకవర్గంలో నిజం గెలవాలి యాత్ర చేపట్టారు. నంద్యాల పట్టణం, వెంకటాచలం కాలనీ, 34వ వార్డులో కార్యకర్త అబ్దుల్ రహీమ్. నంద్యాల పట్టణం, 13వ వార్డులో కార్యకర్త వేములపాడు గురువరాజు కుటుంబాలను పరామర్శించిన అనంతరం అక్కడ తనకు సంఘీభావం తెలిపిన టీడీపీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “పేద ప్రజలకు ఆకలి అనేది తెలియకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ కిలో బియ్యం రూ.2కే ఇస్తే… చంద్రబాబు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్లలో ఒక్క ఏడాదిలోనే 7.5 కోట్ల మంది భోజనం చేశారు. ఇలాంటి అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా మూసివేసి పేదల కడుపు కొట్టింది. అయినా సరే టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిర్విరామంగా అన్న క్యాంటీన్లు నడుపుతున్నారు అని భువనేశ్వరి అన్నారు.

ఏపీకి పరిశ్రమలు రాలేదు… గంజాయి మాఫియా దిగింది

చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి అనేక కంపెనీలు, పెట్టుబడులు తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరికేలా చేస్తే, వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీకి ఒక్క పెట్టుబడి కూడా రాలేదు… ఏపీ నుంచి కంపెనీలు ప్రక్కనున్న రాష్ట్రానికి వెళ్లిపోతున్నాయన్నారు. వైసీపీ రాక్షస పాలనలో ఏపీని గంజాయి, డ్రగ్స్ కు కేంద్రంగా మార్చారని, గంజాయిని మహిళలకు కూడా అలవాటు చేసి, ఆ మత్తులోని మహిళలపై వైసీపీ దుర్మార్గులు అరాచకాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. మహిళలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించాలని. మన ఇంటి బిడ్డకు ఇలా జరిగితే ఏమవుతుందో ఆలోచించి వైసీపీ దుర్మార్గాలపై తిరుగుబాటు చేయాలని భువనేశ్వరి పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని వైసీపీ ఏరులై పారిస్తోంది. కల్తీ మద్యం తాగిన వారు అనారోగ్యానికి గురై చనిపోతున్నారు. మహిళల మాంగల్యాలు మంటగలుస్తున్నాయి. కుటుంబం ముందుకు నడవాలంటే తండ్రి ఉండాలి… కానీ ఆ తండ్రి కల్తీ మద్యం తాగి చనిపోతే ఆ కుటుంబం ఏమవుతుందో ప్రజలు ఆలోచించాలి. అడ్డగోలుగా పన్నులు వేసి, పేద, మధ్యతరగతి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెంచి పేదవాడికి పట్టెడన్నం దొరక్కుండా చేస్తున్నారు” అంటూ భువనేశ్వరి మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement