Monday, April 29, 2024

కొత్త నిబంధ‌న‌ల‌తో వాలంటీర్ల‌కు ఎస‌రు…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం లోనూ, ఆ దిశగా లబ్దిదారులకు సేవలందించడంలోనూ ఇప్పటివరకు కీలకపాత్ర పోషిస్తూ వస్తున్న గ్రామ-వార్డు సచివాలయాల వాలంటీర్లను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన తొలగింపు ఉత్తర్వులను కూడా జారీ చేయడం చూస్తుంటే ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వాలంటీర్లు ఇంటి బాట పట్టక తప్పేటట్లు కనిపించడం లేదు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా ఆయా సచివాలయాల పరిధిలో వాలంటీర్ల వ్యవహార శైలిపై అనేక విమర్శ లు వచ్చినా కేవలం అతి తక్కువ మందిని మాత్రమే తాత్కాలికంగా తప్పించిన సందర్భాలు ఉన్నాయే తప్ప పూర్తి స్థాయిలో విధుల నుంచి తొలగించిన దాఖలాలు లేవు. తాజాగా జగన్‌ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలిస్తే దశల వారీగా వాలంటీర్లను ఇంటి బాట పట్టించేలా కనిపిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో 2 లక్షల 67 వేల మంది వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెల రూ.5 వేలు వంతున గౌరవ వేతనాన్ని అందిస్తోంది. సచివాలయ పరిధిలో మెరుగైన సేవలను ప్రజలకు అందించాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతీ వాలంటీర్‌కు 50 కుటుంబాల బాధ్యతలను అప్పగించారు. 50 నివాసాలకు సంబంధించి కుటుంబ సభ్యులకు అవసరమైన సేవలు త్వరితగతిన అందించడంతో పాటు ప్రభుత్వానికి ఆయా కుటుంబాలను మరింత దగ్గరగా ప్రభుత్వ పథకాలను వారికి అర్ధమయ్యే రీతిలో వివరించేలా వాలంటీర్‌ వ్యవస్థ పనిచేస్తూ వస్తోంది. ఈ నేపధ్యంలోనే కొన్ని విమర్శలు రావడం, మరికొన్ని రాజకీయ పార్టీలు వాలంటీర్‌ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటే అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ నేపధ్యంలోనే వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనరాదని, వారంతా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నామని చెప్పింది. అయితే వాలంటీర్ల సేవలు ఎలా ఉన్నా..ఆరోపణలు వస్తే షోకాజ్‌ నోటీసులు ఇచ్చి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ విచారణ తర్వాత వారి తప్పు చేసినట్లు రుజువైతే తొలగించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంపై వాలంటీర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.

మొదట్నుంచి ఆరోపణలే..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి వాలంటీర్లు అనుకూలంగా పనిచేస్తున్నట్లు పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తూ ఆ వ్యవస్థ తీరుపై పలు ఫిర్యాదులు చేస్తూనే వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం వారిని సమర్ధిస్తూ ఆ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా చర్యలు చేపడుతూ వచ్చింది. ఇదే సందర్భంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో సైతం వాలంటీర్లను ఎన్నికల్లో ఎలా ఉపయోగించుకోబోతున్నామో చెబుతూ వస్తున్నారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అయితే వ్యక్తిగత ఫిర్యాదులు కూడా అందాయి. మరికొన్ని సచివాలయాల్లో అయితే వాలంటీర్లు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారంటూ బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో వాలంటీర్లను తొలగించాల్సి వస్తే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల వాలంటీర్‌ వ్యవస్థ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ముందుచూపుతోనే వారి తొలగింపుకు సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఆ దిశగా మార్గదర్శకాలను కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లకు పూర్తి అధికారాలు
తప్పు చేసిన వాలంటీర్లను విధుల నుంచి తొలగించే అధికారాన్ని ఎంపీడీఓ, మున్సిపల్‌ కమిషనర్‌లకు అప్పగించారు. విచారణలో వాలంటీర్లు అక్రమాలకు పాల్పడ్డారని తెలిస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ దిశగా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అందుకోసం ప్రత్యేకంగా ఆర్డీఓ ఆధ్వర్యంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాలంటీర్లకు ఆయా ప్రాంతాలకు చెందిన పంచాయతీ కార్యదర్శి మొదట షోకాజ్‌ నోటీసు జారీ చేస్తారు. ఆ నోటీసుకు వారం రోజుల్లోపు సంబంధిత వాలంటీర్‌ వివరణ ఇవ్వాలి. అనంతరం ఆ వివరణను పరిశీలించిన కార్యదర్శి విచారణ చేపడుతారు. అందుకు సంబంధించిన నివేదికలను గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఎంపీడీఓకు, మున్సిపల్‌ వార్డు పరిధిలో అయితే కమిషనర్‌కు సమర్పిస్తారు. ఆ నివేదికను ఆర్డీఓ కమిటీ పరిశీలిస్తుంది. అందుకు సంబంధించి వాలంటీర్‌లు అప్పిల్‌ చేసుకునేందుకు రెండు వారాలు గడువును కూడా ఇస్తుంది. తప్పు చేసిన వాలంటీర్‌ ఆర్డీఓ కమిటీ ముందు హాజరై విధి నిర్వహణలో భాగంగా తామెక్కడ అక్రమాలకు పాల్పడలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో వారు తప్పు చేసినట్లు రుజువైతే వెంటనే అటువంటి వాలంటీర్‌పై వేటు వేస్తారు. ఇలా తప్పు చేసిన వాలంటీర్‌ ను ఇంటికి పంపించే అధికారాన్ని ఎంపీడీఓ, కమిషనర్‌లకు కట్టబెట్టారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం వేలాది మంది వాలంటీర్లపై ప్రతిరోజు ఆరోపణలు ఫిర్యాదు వస్తూనే ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే ఫిర్యాదుల ఆధారంగా వాలంటీర్లను ఇంటికి పంపించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలపై వాలంటీర్లలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement