Wednesday, February 14, 2024

Nelloreలో దారుణంతల్లి, కుమార్తె ఆత్మహత్య

నెల్లూరు(క్రైం), నవంబర్‌ 27 (ప్రభ న్యూస్‌) : కుటుంబ కలహాలో..మరేదైనా ఇతర కారణాల్లో స్పష్టంగా తెలియదు కాని తల్లి-కుమార్తెలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నేతాజీనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంకటాచలం సత్రం మండలం కురిచెర్లపాడుకు చెందిన ఎం. గోవర్ధన్‌, ప్రగతినగర్‌ సారాయి అంగడి సెంటర్‌కు చెందిన వాణి(28) డిగ్రీ చదివే సమయంలో ప్రేమలో పడ్డారు. వారిద్దరి కులాలు వేరు కావడంతో గోవర్ధన్‌ తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించలేదు. దీంతో 2018లో గోవర్ధన్‌, వాణిలు నగరంలోని ఓ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్నారు. గోవర్ధన్‌ రామలింగాపురం సమీపంలోని మహేంద్ర ఫైనాన్స్‌ కంపెనీలో రుణాలు ఇచ్చే విభాగంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

వారి దాంపత్య జీవితానికి గుర్తుగా హరిమోక్తిక(3) జన్మనిచ్చారు. సుమారు రెండు నెలలుగా వారు నేతాజీనగర్‌ 8వ వీధిలోని మూడు అంతస్తుల భవనంలో పై పోర్షన్‌లో అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 26వ తేదీన దంపతులు షాపింగ్‌ చేసేందుకు వెళ్లారు. టీపాయి, కార్పెట్‌ కొనుగోలు చేశారు.

రాత్రి వాణి వాటిని పక్కింటిలో ఉన్న వారికి చూపించింది. సోమవారం ఎప్పటిలాగే ఉదయం 9.30 గంటలకు గోవర్ధన్‌ తన విధుల నిమిత్తం వెళ్లాడు. రాత్రి 7 గంటల ప్రాంతంలో అతని మామ సుధాకర్‌ (వాణి తండ్రి) ఫోన్‌ చేసి వాణి ఫోన్‌ లిప్ట్‌ చేయడం లేదని చెప్పాడు. దీంతో గోవర్ధన్‌ భార్య వాణికి ఫోన్‌ చేసినా స్పందించలేదు.

ఈ నేపధ్యంలో వాణి తల్లిదండ్రులు, భర్త గోవర్ధన్‌ హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు లోపల నుంచి గడియ పెట్టినట్లు ఉండడంతో గట్టిగా నెట్టడంతో తలుపు తెరుచుకుంది. దీంతో లోనికెళ్లి చూడా వాణి ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఉండగా చిన్నారి బెడ్‌పై మృతి చెంది పడి ఉంది.

దీంతో కుటుంబ సభ్యులు చీరను కత్తిరించి వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ పీవీ నారాయణ, ఎస్సై అంకమ్మ, ట్రైనీ డీఎస్పీ హేమలతలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. చిన్నారి మృతదేహం పక్కనే పాలగిన్నే ఉండడం, అందులో ఏదో కలిపినట్లు ఉండడంతో వాణి మొదటగా చిన్నారిని చంపి ఆపై ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అన్యోన్యంగా ఉంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమై ఉంటుందని పోలీసులు ఆరా తీస్తున్నారు

గోవర్ధన్‌ వల్లే తమ కుమార్తె మృతి

గోవర్ధన్‌ వల్లే తమ కుమార్తె వాణి చనిపోయిందని మృతురాలి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యోగం పేరిట రోజుల తరబడి ఇంటికి వచ్చే వాడు కాదని, ఇంట్లో డబ్బులు సైతం ఇచ్చేవాడు కాదని, వాణి బంగారు ఆభరణాలన్నీ కుదువ పెట్టాడని వారు ఆరోపించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారించి తగిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. పోలీసులు భర్త గోవర్ధన్‌ను అదుపులోకి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇరువురి మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం జీజీహెచ్‌కు తరలించి వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement