Monday, April 29, 2024

Tirupati: ఎర్రచందనం వేలంపై 14న తిరుపతిలో జాతీయ సదస్సు

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : రాష్ట్రంలో మాత్రమే లభించే ఎర్రచందనం అమ్మకాలకు సంబంధించిన కీలక అంశాలపై ఈనెల 14వ తేదీన తిరుపతిలో జాతీయ స్థాయి ఉన్నత సదస్సు జరగనున్నది. దేశంలోని 17రాష్ట్రాలకు చెందిన అటవీ శాఖ ముఖ్య అటవీ సంరక్షణాధికారులు పాల్గొనే ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వం తరపున డైరెక్టర్ జనరల్ (ఫారెస్ట్స్) ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ప్రధానంగా దేశంలోని వివిధ రాష్ట్రాలలోని ఎర్రచందనం నిల్వల విక్రయాలపై చర్చించ నున్నారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో పట్టుబడిన 5వేల టన్నుల దుంగలు తిరుపతిలోని గోడౌన్ లో ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రం నుంచి విదేశాలకు అక్రమంగా తరలించిండానికి యత్నించిన ఎర్ర చందనం దుంగలు దాదాపు 8 వేల టన్నుల దాకా వివిధ రాష్ట్రాల అదీనంలో ఉన్నాయి. గత పదేళ్ల మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచి మరీ రెండుసార్లు దుంగలను వేలం వేసింది. ఒకసారి రూ.505 కోట్లు, రెండవ సారి రూ.1,660 కోట్లు చొప్పున ఆదాయం లభించింది. మరోసారి వేలం వేసుకోడానికి గత డిసెంబర్ లో కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం మూడో సారి విక్రయాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన ఎర్ర చందనం దుంగలన్నీ రాష్ట్రానికి చెందినవే కనుక వాటిని కూడా వేలం వేసే అధికారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ దుంగలను కూడా వేలంవేసి వచ్చే ఆదాయంలో యాభై శాతం ఆ దుంగలను పట్టుకున్న రాష్ట్రాలకు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనపైనే ఈనెల 14వ తేదీన జరగనున్న జాతీయ సదస్సులో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ కారణంగానే అటవీ ఆదాయ సంబంధిత వ్యవహారాలను చూసే కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల అటవీ ఉన్నతాధికారులతో నిర్వహించే ఈ సదస్సు 14వ తేది ఉదయం 10 గంటలకు తిరుపతి – కరకంబాడి రహదారిలోని మానస సరోవర్ హోటల్ లో జరగనున్నది. అనుకున్న విధంగా ఈ సదస్సు తీర్మానం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో రూ.రెండు మూడు వేల కోట్ల ఆదాయం లభించే అవకాశముంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement