Sunday, April 28, 2024

ఆర్బీకేల ద్వారా సాగుకు సహకారం..

అమరావతి, ఆంధ్రప్రభ : రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మౌలిక వసతుల కల్పన తో పాటు రైతులకు రుణాలు, రాయితీలు, సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమాల అమలుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ది బ్యాంకు (నాబార్డు) కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రత్యేకించి ప్రాథమిక సహకార పరపతి సంఘాల (పీఎసీఎస్‌ – సొసైటీలు) ను రైతు భరోసా కేంద్రాలతో రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానిచంటంతో నాబార్డు కూడా ఆర్బీకేల ద్వారా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సహకారం అందించేందుకు నిర్ణయించుకుని క్షేత్రస్థాయిలో అమలు ప్రక్రియను ప్రారంభించింది.

రాష్ట్రంలో సుమారు 2 వేల సహకార సొసైటీలు ఉండగా వాటి ద్వారానే రుణాలు, సబ్సిడీలు, రాయితీలు అందుతున్నాయి. ప్రత్యేకించి మండల, గ్రామ స్థాయిలో గోదాములు, కోల్డ్‌ స్టోరేజ్‌లు, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల నిర్మాణం, మౌలిక వసతుల కోసం నాబార్డు భారీగా రుణాలందిస్తోంది. రైతులందరి ఉమ్మడి అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా ఆర్బీకే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను నెలకొల్పుతోంది. వాటి కోసం రుణాలందించేందుకు ఇప్పటికే నిర్ణయించిన నాబార్డు పీఏసీఎస్‌ లన్నిటినీ ఆర్బీకే లతో అనుసంధానం చేయటం ద్వారా మెరుగైన పలితాలు వస్తాయని ఆశిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ కోపరేటివ్‌ స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకు (ఆప్కాబ్‌), జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ)లకు భారీగా ఆర్ధిక వనరులు సమకూర్చగలిగితే పీఏసీఎస్‌ ద్వారా రైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందనీ.. ఆర్బీకేలతో అనుసంధానమై అందించే సేవలు కూడా మెరుగుపడతాయని నాబార్డు భావిస్తోంది. దీనిలో భాగంగా షేర్‌ క్యాపిటల్‌ ప్రతిపాదనలు పంపించిన బ్యాంకులకు నాబార్డు నిధులు సమకూరుస్తోంది. తమ వంతుగా ఆప్కాబ్‌కు రూ.100 కోట్లు, డీసీసీబీలకు రూ.190 కోట్లు షేర్‌ క్యాపిటల్‌ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఆర్బీకేల స్థాయిలో కౌలు రైతులను జాయింట్‌ లయబులిటి గ్రూప్స్‌ (జేఎల్‌జీ)గా ఏర్పాటు చేసి సహకార బ్యాంకుల ద్వారా రుణాలందించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.

- Advertisement -

పంట అమ్మకం ద్వారా రైతుకందే సొమ్ముకూ, దాన్ని ప్రాసెసింగ్‌ చేసిన తరువాత వ్యాపారికి అందే మొత్తానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంటు-ంది..ఆ వ్యత్యాసం రైతులు అందుకునేందుకు గ్రామీణ స్థాయిలో ప్రాసెసింగ్‌ వ్యవస్థ ను ఏర్పాటు-చేయాల్సిన అవసరం ఉందని కూడా నాబార్డు అభిప్రాయపడుతోంది. ఆర్బీకేల స్థాయిలో ప్రభుత్వం ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రోత్సాహం అందిస్తున్న క్రమంలో నాబార్డు సహకారం కూడా ఉంటే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వ్యవసాయ, సహకార రంగ నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement