Friday, May 3, 2024

మోపాడు బ‌ల‌హీన చ‌రిత్ర‌… ఇప్ప‌టికైన బాగు చేస్తారా…

ఒంగోలు, ప్రభన్యూస్ : మోపాడు రిజర్వాయర్‌ జిల్లాలోని మధ్యతరహా వనరుల్లో ఒకటి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 12,719 ఎకరాలకు సాగునీటిని అందించే ప్రధాన జలవనరు. అయితే గత పదేళ్లుగా రిజర్వాయర్‌ మనుగడ ప్రశ్నార్థంగా మారింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా చుక్కనీరు లేని మోపాడు చెరువు నామరూపాలే లేకుండా పోయింది. చెరువు అభివృద్ధి జరగలేదు. ప్రభుత్వాలకు అసలు మోపాడు చెరువు ఉందనే విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫలితంగా చెరువు చిల్లచెట్లతో అడవిని తలపించే విధంగా తయారైంది. చెరువు కట్టలు, అలుగు, కాలువలు, చెరువు లోపలి భాగంతో పాటు కట్ట కూడా బలహీనపడింది. తద్వారా ఏళ్ల తరబడి రిజర్వాయర్‌కు నీరు సమృద్ధిగా చేరుతున్న పరిస్థితి లేదు.

దాని పర్యవసానమే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భారీ ఎత్తున వరదనీరు చేరి, కట్టలకు లీకులు ఏర్పడటం, అలుగు పారడం, కట్ట తెగుతుందనే భయం వెంటాడటం, సర్వత్రా ఆందోళన కలిగించింది. వాస్తవంగా చెరువుకు 29 అడుగుల నీటి మట్టం ఉంటే కానీ రిజర్వాయర్‌ అలుగు పారదు. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో 30 అడుగులకు పైగా రిజర్వాయర్‌కు నీరు వచ్చి చేరడంతో ప్రమాదప‌స్తాయికి చేరింది. దీంతో 25 ఏళ్ల క్రితం జరిగిన ఘోరాకలిని దృష్టిలో ఉంచుకుని దిగువున ఉన్న గ్రామాలను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

స్వాతంత్య్రానికి ముందు అప్పటి బ్రిటీష్‌ పాలకుల కాలంలో 1906లో మోపాడు రిజర్వాయర్‌ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. 1921లో రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేసి, జిల్లాలోని పామూరు మండలంలో 8,174 ఎకరాలు, నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో 4,545 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పూర్తి చేశారు. పూర్తిగా వర్షాధారం పై ఆధారపడిన మోపాడు రిజర్వాయర్‌ గత పదేళ్లుగా చుక్కనీరు వచ్చిన పరిస్థితి లేదు. మొదటి నుంచి కూడా మోపాడు పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తూ ఉండటంతో మోపాడు రిజర్వాయర్‌ అభివృద్ధి దిశగా అడుగులు వేయలేక పోయింది.

రిజర్వాయర్‌ నిర్మాణం జరిగిన తరువాత 1996లో వచ్చిన వరద ఉధృతికి ఆనకట్ట తెగి 100 మంది వరకు మృతి చెందారు. అయినా.. ఆ తరువాత రిజర్వాయర్‌ అభివృద్ధి, కట్టల పటిష్టత దిశగా దృష్టి సారించలేదు. గత ఏడాది రిజర్వాయర్‌, కాల్వలు, ఆనకట్ట సీసీ కాలువల పనులకు రూ.31 కోట్ల జైకో నిధులు మంజూరు అయ్యాయి. అయితే తరచుగా వర్షాలు పడుతుండటంతో కాంట్రాక్టర్‌ పనులు చేపట్టలేదు. దీంతో ఒక్క సారిగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద ప్రవాహానికి నీటిమట్టం పెరిగిపోయి లీకులు ఏర్పడ్డాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement