Friday, May 17, 2024

ఎమ్మెల్యేలు చైర్మన్లగా అసైన్డ్ కమిటీలు

రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ నిమిత్తం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చైర్మన్లుగా  అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సమగ్ర భూ రీ సర్వేతో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. వెలగపూడిలోని అసెంబ్లీ భవనంలో లో ఉన్న కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి అసైన్డ్ భూములు, అసైన్ మెంట్ కమిటీల ఏర్పాటుపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ చేయడానికి సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారన్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే అధ్యక్షతన నియోజకవర్గ స్థాయిలో అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేల అధ్యక్షతన అసైన్ మెంట్ కమిటీలు ఉండేవన్నారు. తరవాత కాలంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ గా జిల్లా స్థాయి అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటయ్యాయన్నారు. ఎమ్మెల్యేల నేతృత్వంలో అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కమిటీలు ఆయా నియోజకవర్గాల్లోని నిరుపేదలను గుర్తించి భూ పంపిణీకి అర్హులుగా వారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారన్నారు. రాష్ట్ర చరిత్రలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అత్యధికంగా నిరుపేదలకు భూములు పంపిణీ చేశారన్నారు. 2014 నుంచి గత ప్రభుత్వ హయాంలో భూ పంపిణీ చేయలేదన్నారు.

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి భూ పంపిణీకి శ్రీకారం చుడుతున్నారన్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యేల నేతృత్వంలో అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నారు. సమగ్ర భూ రీ సర్వే ద్వారా శాశ్వత భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల ఎకరాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.9,900 కోట్లు వెచ్చించి 25 వేల ఎకరాలకు పైగా కొనుగోలు చేశామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నిరుపేదలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారన్నారు. అర్హులను గుర్తించి రెండున్నర ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట గాని ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. భూ పంపిణీ సమగ్ర భూ రీ సర్వేతో సీఎం జగన్ హయాంలో భూ వివాదాలన్నీ పరిష్కారమయ్యాయనే సంతృప్తి ప్రజల్లో కలుగుతుందన్నారు. అంతకుముందు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి మాట్లాడుతూ, రాష్ట్రంలో గతంలో జరిపిన భూ పంపిణీ విధానంపైనా, అసైన్డ్ చట్టాలపైనా, అసైన్ మెంట్ కమిటీల రూపకల్పనపైనా వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా 1954లో పేదలకు భూములు పంపిణీ చేశారన్నారు. అప్పటి నుంచి 2014 వరకూ 33,29,908 ఎకరాలు పంపిణీ చేశారన్నారు. సమీక్షా సమావేశానికి హాజరైన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజకవర్గాల్లోని భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, సీసీఎల్ఎ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, , రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి, లాండ్ సర్వే కమిషనర్ సిద్ధార్థ జైన్, ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్ రెడ్డి, విప్ లు దాడిశెట్టి రాజ, కాపు రామచంద్రారెడ్డి, పలువురు ఎమెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: 11 ఏళ్లకే బిడ్డకు జన్మినిచ్చిన బాలిక!

Advertisement

తాజా వార్తలు

Advertisement