Saturday, April 20, 2024

Bosta: శుభ‌కృత్ నామ సంవ‌త్సరంలో అన్నీ శుభాలే

విజ‌య‌న‌గ‌రం జిల్లా కొత్త‌పేట‌లోని శ్రీ మ‌న్నార్ రాజగోపాల స్వామి ఆల‌యంలో శ‌నివారం నిర్వ‌హించిన ఉగాది వేడుక‌లు శాస్త్రోక్త పూజ‌లు, వేద‌పారాయ‌ణ మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల న‌డుమ అత్యంత వైభవంగా జ‌రిగాయి. పంచాగ ప‌ఠ‌న వేదిక వ‌ద్ద ఉత్స‌మూర్తులు ఆశీనుల‌వ్వ‌గా.. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పుర‌పాల‌క మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శుభ‌కృత్ నామ సంవత్స‌ర ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని వేద‌పండితులు వేద‌పారాయ‌ణం చేయ‌గా.. బ్రహ్మ శ్రీ ల‌క్కోజు ఓంకార్ ఆచార్య పంచాగ శ్ర‌వ‌ణం చ‌దివి వినిపించారు. ఈ ఏడాది జిల్లా ప్ర‌జ‌లు సుభిక్షంగా.. సుఖ‌సంతోషాల‌తో జీవిస్తార‌ని పేర్కొన్నారు. విస్తారంగా వ‌ర్షాలు కురుస్తాయని సమృద్ధిగా పంట‌లు పండుతాయ‌ని తెలిపారు. రైతులు ఆర్థిక పురోగతి సాధిస్తార‌ని, మంచి జీవనాన్ని కొన‌సాగిస్తార‌ని పేర్కొన్నారు. ప‌రిపాల‌న ప‌రంగా చూసిన‌ట్ల‌యితే జిల్లా వాసుల‌కు సుప‌రిపాల‌న అందుతుంద‌న్నారు. కొన్ని ఆర్థిక ఒడుదొడుకులు ఎదురైన‌ప్పటికీ నిల‌దొక్కుకొనే ప‌రిస్థితి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌జ‌లపై ప‌న్నుల భారం ఉంటుంద‌ని, నిత్య‌వ‌స‌రాల ధ‌ర‌లు కూడా పెరుగుతాయ‌ని వెల్ల‌డించారు.

సంక్షేమం ఆశాజ‌న‌కంగా ఉంటుంద‌ని, పాడిపంట‌లు బాగుంటాయని రైతుల ఆర్థిక స్థితి హ‌ర్షించ‌ద‌గిన విధంగా ఉంటుందని అన్నారు. ప్ర‌జ‌ల్లో పాప‌భీతి పెరిగి మంచి అల‌వాట్లు పెరుగుతాయన్నారు. అంటు వ్యాధులు ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. వ‌ర్షాలు విస్తారంగా కురిసి న‌ల్ల‌రేగ‌డి భూముల్లో పంట‌లు బాగా పండుతాయ‌ని వివ‌రించారు. రాజ‌కీయ ప‌రంగా చూసిన‌ట్ల‌యితే అధికార పార్టీకి ప్ర‌తిప‌క్షాల నుంచి గ‌ట్టి విమ‌ర్శ‌లు ఉంటాయ‌ని, అధికారి పార్టీ వాటిని బ‌లంగా తిప్పికొడుతుంద‌ని అన్నారు. ష‌డ్రుచుల స‌మ్మేళ‌నం మాదిరి… ఈ ఏడాది మంచి చెడులు క‌ల‌గ‌ల‌సి ప్ర‌జ‌ల జీవ‌నం ఆశించిన విధంగానే ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ ఏడాది జిల్లా ప్ర‌జ‌లంద‌రూ సుభిక్షంగా.. సంతోషంగా ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అంద‌రికీ మంచి జ‌రగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. స‌కాలంలో వ‌ర్షాలు ప‌డి.. పంట‌లు బాగా పండి రైతులు ఆర్థికంగా బాగుండాలన్నారు. రాబోయే రోజుల్లో మ‌రింత మంచి జ‌ర‌గాల‌ని ఆశిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రింత మంచి పాల‌న అందించాల‌ని కోరారు. ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా ప్ర‌జల సుఖ సంతోషాలే ల‌క్ష్యంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను మ‌రింత‌ విజ‌య‌వంతంగా కొన‌సాగించాల‌ని పేర్కొన్నారు. జిల్లా ప్ర‌ల‌జంద‌రికీ శ్రీ శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement