Friday, May 17, 2024

మహా జ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్.. పవన్

మహా జ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నేను, నా దేశం.. ఈ రెండింటిలో నా దేశమే అత్యంత ముఖ్యమైనది, ఎంత గొప్ప మాటలు… ఇంత మంచి మాటలు బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా గొప్పగా ఎవరు చెప్పగలరు ? రాజ్యాంగమనే మహా సూత్రాలను భరత జాతికి అందించి, ఈ దేశం సమైక్యంగా.. సమున్నతంగా.. సమభావంగా.. శక్తిమంతంగా.. ముందుకు సాగడానికి పద నిర్దేశం చేసిన దేశ భక్తుడని పవన్ అన్నారు. అంబేద్కర్ వంటి మహాజ్ఞాని కోటికొక్కరని అన్నారు. ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకుని వినమ్రంగా ప్రణామాలు అర్పిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా తనకు అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాత అన్నారు. ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నానన్నారు. అధ్యయనం చేశాను. లండన్ లో ఒకప్పుడు ఆయన నివసించి, ఇప్పుడు స్మారక మందిరంగా రూపుదిద్దుకున్న గృహాన్ని సందర్శించానన్నారు.

అదేవిధంగా లక్నోలో గొప్పగా నిర్మితమైన ఆయన స్మారక మందిరాన్ని తిలకించానన్నారు. మరెన్నో విషయాలు తెలుసుకున్నాను. బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. విద్యావేత్తగా.. మేధావిగా.. న్యాయకోవిదునిగా.. పాత్రికేయునిగా.. రాజకీయ నాయకునిగా.. రాజ్యాంగ నిర్మాణ సారధిగా.. న్యాయశాఖామంత్రిగా ఆయన ఈ దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. విమర్శలకు వెరవని అంబేద్కర్ ‘ఏ కారణం లేకుండా నీపై విమర్శలు వస్తున్నాయంటే.. నువ్వు విజయం సాధించబోతున్నావని అర్థం’ అంటారన్నారు. “మేకల్ని బలి ఇస్తారు, కానీ పులులను బలి ఇవ్వరు, కాబట్టి పులుల్లా బతకండి”అని అణగారిన వర్గాలలో ధైర్యం నింపారన్నారు. అస్పృశ్యత, అంటరానితం నిర్మూలనకు తన జీవిత చరమాంకం వరకు అవిరళ కృషి చేసి అసామాన్యునిగా నిలిచారన్నారు. అందుకేనేమో ఆయన ‘భారత రత్న’గా ప్రకాశిస్తున్నారన్నారు. ఆ మహానుభావుని మూలసూత్రాల ఆధారంగా జనసేన ప్రస్థానం చిరంతనంగా సాగుతుందని ప్రమాణం చేస్తూ.. ఆయన బోధించిన ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ అనే మాటలను మననం చేసుకుంటూ శాంతిమూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళి అర్పిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement