Monday, April 29, 2024

కర్నూలు లేదా కడప జిల్లాలకు వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు పెట్టాలి.. స్వర్ణకార, బీసీ సంఘాల డిమాండ్

 న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాల కసరత్తు అనేక కొత్త డిమాండ్లకు ఆస్కారం కల్పిస్తోంది. జిల్లా కేంద్రాల విషయంలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తుండగా, జిల్లాకు పెట్టే పేరు విషయంలో కొందరు ఆందోళన చేస్తున్నారు. తాజాగా కర్నూలు లేదా కడప జిల్లాకు కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పేరు పెట్టాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ సంఘాలు, స్వర్ణకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శనివారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరక్టర్ కర్రి వేణుమాధవ్ మీడియా సమావేశం నిర్వహించి తమ డిమాండ్‌ను ప్రభుత్వం ముందు పెట్టారు.

నాలుగు శతాబ్దాల క్రితమే భవిష్యత్తును ఊహించి చెప్పిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఆ రోజుల్లోనే సామాజిక సంస్కరణలు చేపట్టారని గుర్తుచేశారు. కులమతాలు వృత్తులు సజావుగా సాగడానికే తప్ప వివక్ష చూపడానికి కాదని చెబుతూ తన శిష్యుల్లో ముస్లిం మతానికి చెందిన సిద్దయ్యను, దళిత వర్గానికి చెందిన కక్కయ్యను ప్రధాన శిష్యులుగా చేసుకుని వారికి ఆత్మజ్ఞానం ప్రబోధించారని కర్రి వేణుమాధవ్ గుర్తుచేశారు. సైన్స్ అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లోనే పిట్యుటరీ గ్లాండ్, ప్రొస్టేట్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్ గురించి చెప్పారని అన్నారు. ఆయన కర్నూలు జిల్లా బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంట్లో ఉంటూ, రవ్వలకొండ గుహల్లో కాలజ్ఞానాన్ని రాశారని వేణుమాధవ్ గుర్తుచేశారు. ఆయన నిర్మించుకున్న మొదటి పీఠం బనగానపల్లెలో ఉందని తెలిపారు. కడప జిల్లా కందిమల్లయ్యపల్లి గ్రామంలో ఆయన సజీవసమాధి పొందారని, ఈ నేపథ్యంలో కడప లేదా కర్నూలు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement