Monday, April 29, 2024

AP: ఏసీబీ వలలో కర్నూలు మార్కెట్ యార్డ్ ఏవో

కర్నూలు జిల్లా (ఎమ్మిగనూరు) : కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మార్కెట్లో వెజిటబుల్, డ్రై ఫుడ్ దుకాణం ఏర్పాటు చేసేందుకు వ్యక్తి వద్ద నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటూ మార్కెట్ యార్డ్ ఏవో మహేశ్వరి అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మిగనూరు పట్టణంలోని సాయి గణేష్ కాలనీకి చెందిన బి.వినయ్ కుమార్ అనే వ్యక్తి ఎమ్మిగనూర్ మార్కెట్ ఆవరణంలో వాలంటరీ ట్రేడ్ ఫ్రూట్స్, వెజిటబుల్ లైసెన్సు జారీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దుకాణం ఏర్పాటు చేసేందుకు మార్కెట్ యార్డ్ ఏవో మహేశ్వరి తనకు రూ.15 వేలు లంచం ఇవ్వాలని వినయ్ కుమార్ ను డిమాండ్ చేశారు.

అయితే లంచం ఇచ్చేందుకు ఇష్టం లేని వినయ్ కుమార్ ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారిచ్చిన సలహాలు, సూచన మేరకు తాను ఏవో డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం మధ్యాహ్నం 1.45 నిమిషాలకు రూ.15వేలు కర్నూలు మార్కెట్ యార్డ్ ఏవో కు అందజేశారు. అయితే అప్పటికే వ‌ల‌పన్నిన ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డారు. అనంతరం ఏవో కుడి వైపు టేబుల్ లో ఉంచబడిన నగదు రూ.15వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏవో చేతులను సోడియం కార్బేట్ రసాయన పరీక్ష నిర్వహించగా రంగు మారాయి. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement