Friday, May 3, 2024

AP: కాలుష్యాన్ని నియంత్రించే వరకు ఉద్యమిస్తాం.. విద్యార్థులతో మానవహారం

ఇబ్రహీంపట్నం, ప్రభ న్యూస్ః ఎన్టీటీపీఎస్, ఏపీ జెన్ కో యాజమాన్యాలు దిగివచ్చి కాలుష్యాన్ని నియంత్రించే వరకు ఉద్యమిస్తామని వక్తలు పునరుద్ఘాటించారు. ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు వెంకటేశ్వరరావు కల్యాణ మండపంలో గురువారం ఎన్టీటీపీఎస్ కాలుష్య నియంత్రణ పోరాట సమితి పేరుతో సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి కాలుష్య ప్రభావిత గ్రామాల నుంచి ప్రజలు, మేధావులు, న్యాయవాదులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కాలుష్య ప్రభావిత గ్రామాలపై ఎన్టీటీపీఎస్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం ఇచ్చిన ఏ హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. కాలుష్యం ధాటికి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా, ప్రాణాలు పోతున్నా మెడికల్ క్యాంపులు నిర్వహించడం లేదన్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న గ్రామాల్లో పర్యావరణాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీటీపీఎస్, ఏపీ జెన్ కో కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలుష్యాన్ని నియంత్రించాలని, ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎన్టీటీపీఎస్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement