Saturday, June 22, 2024

Joginapally’s Green India – హ‌రిత సంతోషం….

భావితరాల భవిత కోసం జోగినపల్లి శ్రీకారం…
హరితోద్యమానికి అపూర్వ స్పందన, ప్రశంసలు…
కేసీఆర్‌ స్ఫూర్తితో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు శ్రీకారం..
తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఛాలెంజ్ షురూ
హ‌రిత విప్లవానికి పలు అవార్డులు, రికార్డులు

(పసునూరి భాస్కర్‌, న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జి)

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రజల ఆరోగ్యాల ను పరిరక్షించాలంటే.. పర్యావరణ పరిరక్షణతోనే సాధ్యమన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ విశ్వాసాన్ని ప్రభుత్వ బాధ్యతగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు, తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మహాయజ్ఞంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. కేసీఆర్‌ చొరవతో అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటి, పరిరక్షించే కార్యక్రమాలు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఏడాది వర్షాకాలంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు.

పచ్చని బతుకు కోసం.. చేతులు కలపండి
ప్రజల భాగస్వామ్యం లేకుండా సాగే ఏ కార్యక్రమం సక్సెస్‌ కాదని, వారిలో స్ఫూర్తిని పెంచి, స్వచ్ఛందంగా కలిసొచ్చేలా హరిత హారం స్ఫూర్తిని ప్రతిఒక్కరి మదిలో రగిలించాలని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ సంకల్పించారు. కేసీఆర్‌ మార్గదర్శకంలో హరితహారం లక్ష్యాలను చేరుకునేందుకు 2018 జులై 17న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు. ప్రపంచాన్ని జాగృతం చేసే విషయాల్లో గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోందని, గ్లోబల్‌ కమ్యూనికేషన్‌కు ఉన్న అవకాశాలను అనుకూలంగా మార్చుకొని, రండి చేతులు కలపండి అంటూ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. స్వయంగా మూడు మొక్కలు నాటి, ముగ్గురికి ఛాలెంజ్‌ విసిరి, మొక్కలు నాటేలా చేశారు సంతోష్‌ కుమార్‌. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఛాలెంజ్‌ కార్యక్రమాలకు అంకురార్పణ జరుగుతున్నప్పటికీ, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ తరహాలో ప్రపంచాన్ని కదిలించిన ఛాలెంజ్‌ మాత్రం లేదనేది అక్షరసత్యం. ప్రారంభించిన నాటి నుంచి, సమాజంలో మార్పునకు శ్రీకారం చుట్టిన, రోజురోజుకూ బలీయమైన శక్తిని పెంపొందించుకుంటున్న కార్యక్రమం గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ మాత్రమే.

- Advertisement -

హరిత తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా..
తెలంగాణాలో అటవీ విస్తీర్ణాన్ని 24శాతం నుండి 33శాతానికి పెంపొందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. రాష్ట్ర ప్రజల సమగ్రాభివృద్ధిని సాధించాలన్న సీఎం కేసీఆర్‌ దార్శనికతకు తెలంగాణకు హరితహారం నిదర్శనం. దట్టమైన అడవులున్న ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు పడతాయని, వ్యవసాయ ఉత్పాదకతను పెంపునకు అడవులు దోహదపడతాయని, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలోనూ ఉపయోగపడతాయని, తద్వారా ఆరోగ్యకరమైన ప్రజా జీవనం సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి విశ్వసించారని, అందుకోసమే పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతు కృషి చేయాలన్న లక్ష్యంతోనే గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టినట్లు పలు సందర్భాల్లో సంతోష్‌ కుమార్‌ తెలిపారు.

హైదరాబాద్‌లో మొదలై..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రారంభమైన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ అనతికాలంలోనే సామాన్యులు మొదలు సెలబ్రిటీ-ల వరకు చేరుకుంది. మొక్కలు నాటడం, చెట్లకు నీళ్లుపోయడం, వృక్షసంపదను కాపాడడం, ప్రకృతి మాతను కాపాడుకోవడంలో అందరూ భాగస్వాములవుతున్నారు. ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కేవలం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదు, రాష్ట్ర ఐటీ, మునిసిపల్‌ శాఖల మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమం చేపట్టి, ఎంపీ సంతోష్‌ 2,042 ఎకరాల కీసర రిజర్వ్‌ ఫారెస్ట్‌ ను దత్తత తీసుకున్నారు. దీంతో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ మరో ముందడుగు వేసింది. అడవిని దత్తత తీసుకోవడమనే వినూత్న కార్యక్రమానికి సంతోష్‌ శ్రీకారం చుట్టినట్లయింది.

భావితరాల భవిత కోసం.. హరిత విప్ల వాన్ని కొనసాగించాలి..
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌, తమ తమ కుటుంబాల్లో జరుపుకొనే ప్రత్యేక వేడుకల్లో భాగంగా మారిపోయిందని, పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇతర శుభకార్యాల్లోనూ మొక్కలు నాటడం సర్వసాధారణంగా మారిపోయిందని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. ఇంతటి చైతన్యాన్ని తీసుకు వచ్చిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను కొనసాగించాలని వారు ఎంపీ సంతోష్‌ను కోరుతున్నారు. మహాయజ్ఞంగా సాగుతున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌తో సమాజంలో పర్యావరణ పరిరక్షణ పట్ల చైతన్యం పెరుగుతోందని, దానిని ప్రజల బాధ్యతగా మార్చాల్సిన విషయమై జోగినపల్లి దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement