Wednesday, May 1, 2024

జనసేన అధికారంలోకి రావడం చారిత్రక అవసరం: నాగబాబు..

ప్రభ న్యూస్‌ బ్యూరో శ్రీకాకుళం : రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ అరాచక పాలన సాగుతోందని, అధికార మదంతో రాష్ట్రంలోని రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వం పతనం చేస్తోందని, ఈ పరిస్థితులలో జనసేన లాంటి పార్టీ అధికారంలోకి రావలసిన చారిత్రక అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కూడా భావిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు తెలిపారు. జనసేన పార్టీని బలోపేతం చేసే చర్యలలో భాగంగా నాగబాబు బుధవారం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనను చేపట్టారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం జిల్లాలోని అసెంబ్లిd నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, పార్టీ కార్యకర్తలతో అరసవల్లి రోడ్డులో ఉన్న ఒక ప్రైవేటు హోటల్‌లో ఆయన పార్టీ అంతర్గత సమావేశం నిర్వహించి, పార్టీ కార్యకర్తలు, ఇన్‌ఛార్జ్‌లతో ముఖాముఖి మాట్లాడి, జిల్లాలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబు పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాలలో జనసేన కార్యకర్తలు, నాయకులలొ ఏమైనా అభిప్రాయ బేధాలుంటే వాటిని పక్కకు పెట్టి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.

జనసేన పార్టీకి ప్రజల నుంచి రోజురోజు ఆదరణ పెరుగుతోందని, దానిని మరింతగా పెంచుకోవడానికి ప్రజా సమస్యలపై జనసైనికులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం పట్ల ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోందని నాగబాబు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం బాగుండటమే కాకుండా భవిష్యత్‌ తరాల ప్రయోజనాలకోసం కూడా పవన్‌ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలన్న ఆశతో ప్రజలు ఉన్నారని ఆయన తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా ప్రయోజ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి దోహదపడే అభిప్రాయాలు అన్ని వర్గాల ప్రజలు, జనసైనికులనుంచి తెలుసుకుంటూ, పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యకలాపాలపై నాగబాబు జనసైనికులకు పలు సూచనలు చేశారు. రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చించి త్వరలో అన్ని నియోజకవర్గాలకు, మండలాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లను, కమిటీలను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామని, దీని ఆవశ్యకతను పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి కూడా తీసుకువెళతానని ఆయన తెలిపారు. పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, సమన్వయంతో పార్టీ కార్యకలాపాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్ల్లా స్థాయి నాయకులతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని ఇఛ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, నరస్నపేట, ఆమదాలవలస, శ్రీకాకుళం, రాజాం, పాలకొండ,ఎచ్చెర్ల నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో పాటు, ఎంపిటిసి, వార్డు సభ్యులుగా పోటీచేసి గెలుపొందిన ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేస్తాం..

ర్యక్రమం అనంతరం నాగబాబును కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర జిల్లాలలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు, పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన చేపట్టినట్లు నాగబాబు తెలిపారు. ప్రజలనుంచి జనసేన పార్టీకి ఇటీవల కాలంలో విపరీతమైన ఆదరణ లభిస్తోందని, ఆ మేరకు జనసేన రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంతో పాటు పార్టీ సిధ్దాంతాలను ప్రజలకు వివరించడం జరుగుతోందని అన్నారు.

జనసేనలో చేరికలు…

- Advertisement -

కాగా జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన యువకులు జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితులై ఆపార్టీలో చేరేందుకు ముందుకు రాగా వారికి పార్టీ కండువాలు వేసి నాగబాబు పార్టీలోకి ఆహ్వానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement