Sunday, April 28, 2024

AP | బస్సు యాత్రలో కలకలం.. జగన్ పై రాయితో దాడి, కంటికి గాయం

.( ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో )రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు లో యాత్ర ముగించుకుని వారధి మీదుగా ఎన్టీఆర్ జిల్లాల్లోకి ప్రవేశించిన బస్సు యాత్ర తూర్పు, సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో శనివారం కొనసాగింది. తూర్పు నియోజకవర్గంలో పూర్తయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగ్ నగర్ ప్రాంతానికి చేరుకుంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి జగన్ పైకి రాయి విసిరారు. సింగ్ నగర్ ప్రాంతంలోని డాబా కోట్ల సెంటర్ వద్ద గంగానమ్మ గుడి దగ్గరకు చేరుకుంటున్న సమయంలో అతివేగంగా వచ్చిన రాయి సీఎం జగన్ ఎడమ కంటి కనురెప్ప పైన తగిలింది.

దీంతో జగన్ ఎడమ కంటికి స్వల్ప గాయం అయింది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా రాయి తగిలి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, జగన్మోహన్ రెడ్డిని బస్సులోనికి తీసుకువెళ్లి ప్రధమ చికిత్సను అందజేశారు. కొద్దిసేపు తర్వాత యాత్ర యధావిధిగా కొనసాగింది.

అయితే బస్సు యాత్ర సందర్భంగా విజయవాడలో అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. ఒకవైపు ఈదురు గాలులు చిరుజల్లులతో వర్షం పడుతుండగా మరోవైపు పలు ప్రాంతాలలో ట్రాఫిక్కు సైతం అంతరాయం కలిగింది. ఇదే సమయంలో బస్సు యాత్ర జరుగుతున్న పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. బస్సు యాత్ర సందర్భంగా జగన్ పై జరిగిన ఈ సంఘటనతో క్యాడర్ నివ్వెర పోయారు.

మెరుగైన చికిత్స కోసం జిజిహెచ్ కు..బస్సు యాత్రలో అగంతుకుడు విసిరిన రాయి కారణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటి పై భాగంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రధమ చికిత్స చేసిన వైద్యులు అనంతరం యాత్ర యధావిధిగా కొనసాగింది.

విజయవాడలో యాత్ర ముగించుకొని కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన అనంతరం వైద్యులు సూచన మేరకు చికిత్స కోసం జగన్ బస చేసిన గన్నవరం ప్రాంతం నుండి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు.

- Advertisement -

గత ఎన్నికల సమయంలో విశాఖపట్నం ఎయిర్పోర్టులో కోడి కత్తి దాడి సంఘటన అనంతరం చికిత్స కోసం హైదరాబాదు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన నేపథ్యంలో ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకు సీఎం జగన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఎన్నికల సంఘం సీరియస్..

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాళ్లదాడి పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. జరిగిన సంఘటనపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇతని పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని విజయవాడ సి పి కు రాష్ట్ర డిజిపి కార్యాలయం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement