Thursday, May 2, 2024

Jagan New Strategy – ఎంపీ సీట్లపై వైసీపీ బస్కీలు – ఎమ్మెల్యేలకు ఊరింతలు

అమ‌రావ‌తి – సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ల మార్పులు చేర్పులపై రేగిన అసంతృప్తిని నీరుగార్చే క్రమం ఒకవైపు, ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై మరో వైపు వైసీపీ అధిష్టానం తలమునకలవుతోంది. అటు అసంతృప్తి ఎమ్మెల్యేలకు ఎంపీ టిక్కెట్ల గాలం వేస్తూ.. ఎంపీ టిక్కెట్టుకు తలూపని సిట్టింగ్లకు ఊరింతల తాయిలాలతో అధిష్టానం జోగొడుతోంది. అలిమికాని చోట పాత అభ్యర్థులనే రంగంలోకి దించుతోంది. ఇక ఎంపీ స్థానాలపైనా దృష్టి కేంద్రీకరించింది. పాత ఎంపీల స్థానంలో కొత్త అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులే ఎన్నికల ఖర్చు భరిస్తారని, ఎంపీగా పోటీ చేయాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఊరడిస్తోంది. అలివికాని చోట పాత అభ్యర్థులకే ఛాన్స్ ఇస్తున్నట్టు సమాచారం. ఇక ఇప్పటి వరకూ ఒంగోలు ఎంపీ స్థానంపై కొనసాగిన పీటముడి వీడిపోయింది. ఒంగోలు ఎంపీ టికెట్ పైస్పష్టత వచ్చింది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని జరిగిన ప్రచారానికి తెరపడింది. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చలతో అధిష్టానం మాగుంటకు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం తాడేపల్లిలోని సీఎంవోలో సీఎం జగన్ తో బాలినేని భేటీ అయ్యారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డికే ఎంపీ టిక్కెట్టు ఇవ్వాలని బాలినేని శ్రీనివాస రెడ్డి అధిష్టానాన్ని ఒప్పించార. దీంతో ఎమ్మెల్యేగా బాలినేని, ఎంపీగా మాగుంగ పోటీలో ఉంటారు.

ఇక నెల్లూరు నుంచి తాను పోటీ చేస్తానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయన పేరునే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మచిలీపట్నం నుంచి టాలీవుడ్ దర్శకుడు వీవీ.వినాయక్‌ను పోటీకి దించేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కానీ వినాయక్ నుంచి సానుకూల సమాధానం లేకపోవటంతో… తాజాగా పెనమలూరు ఎమ్మెల్యే కేపీ సారథిని రంగంలోకి దించేందుకు అధిష్టానం ఆఫర్ ఇచ్చింది. సారథి మాత్రం మౌన దీక్షలో ఉన్నట్టు సమాచారం.

నంద్యాల ఎంపీ స్థానం నుంచి నటుడు అలీ, కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు భోగట్టా. గుంటూరు సీటును సినీ నటుడు ఆలీ ఆశిస్తున్నారు. విజయనగరం నుంచి చిన్న శీను, అనకాపల్లి నుంచి కరణం ధర్మశ్రీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ టికెట్‌ను బీసీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా..ఇంకా అభ్యర్థిని ఫైనల్‌ చేయలేదని తెలుస్తోంది. విశాఖపట్నం పార్లమెంటు బరిలో బొత్స ఝాన్సీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గుంటూరు నుంచి లావు శ్రీ కృష్ణ దేవరాయలును రంగంలోకి దించాలని అధిష్టానం భావిస్తోంది. కానీ లావు కృష్ణదేవరాయలు మాత్రం తాను నరసరావు పేటను వదిలేది లేదని స్పష్టం చేశారు. ఇంత ఒత్తిడిలోనూ నరసరావుపేట నుంచి మోదుగుల వేణుగోపాలరెడ్డి పేరును ఓకే చేసే అవకాశం ఉంది.

కర్నూల్ ఎంపీ బరిలో గుమ్మనూరి జయరామ్, నరసాపురం నుంచి గోకరాజు రంగరాజు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రాజమండ్రి బరిలో అనుసూరి పద్మలత, బాపట్ల నుండి నందిగం సురేష్ పేరు కూడా వినిపిస్తోంది. వాస్తవానికి కొండెపి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నందిగం సురేష్ను అధిష్టానం ఆదేశించింది. కానీ స్థానిక కేడర్ నుంచి వ్యతిరేకత రావటం, అలాగే బాపట్ల ఎంపీ స్థానంలో సరైన అభ్యర్థి కనిపించక పోవటంతో నందిగం సురేష్ పేరును పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక తిరుపతి నుంచి గురుమూర్తి, కడప నుంచి అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి పేర్లు దాదాపు కరారైనట్టే. అనంతపురం ఎంపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా శంకర నారాయణ, హిందూపురం ఇన్‌ఛార్జ్‌గా శాంత, అరకు ఇన్‌ఛార్జ్‌గా భాగ్యలక్ష్మిని ఇప్పటికే వైసీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించిన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement