Friday, May 17, 2024

కేజీబీవీల్లో ఇంటర్‌ తరగతులు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..

అమరావతి, ఆంధ్రప్రభ:రాష్ట్రంలోని 352 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లు స్వీకరించేందుకు అనుమతినిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. 2018- 19 విద్యా సంవత్సరం నుంచే 221 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ బోధన జరుగుతుండగా.. ఈ ఏడాది నుంచి మిగిలిన 131 కేజీబీవీలను అప్‌గ్రేడ్‌ చేస్తూ పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ అప్రూవల్‌ బోర్డు ఆమోదం మేరకు ఈ కళాశాలలన్నింటిలో ఇంటర్మీడియట్‌కు సంబంధించి ఒక గ్రూప్‌కే తరగతులు జరుగుతాయి. ఒక్కో కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ఇలా ఒక గ్రూప్‌ మాత్రమే కొనసాగుతుంది.

ఇంటర్‌ తరగతులపై స్పష్టతనివ్వాలి:ఏపీ హెచ్‌ఎంఏ

ఇంటర్మీడియట్‌ బోర్డు మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేసిందని, మరోవైపు ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని 292 ఉన్నత పాఠశాలల్లో బాలికలకు ఇంటర్మీడియట్‌ తరగతులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా.. విద్యాశాఖ నుంచి ఆ మేరకు ఉత్తర్వులు రాలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవీ నారాయణరెడ్డి, వి. శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌కు సోమవారం రాసిన లేఖలో ఈ అంశంపై స్పష్టతనిస్తే విద్యార్థులు అడ్మిషన్ల ప్రయత్నాలు చేసుకుంటారన్నారు. పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ తరగతులను బోధించడానికి ఉపాధ్యాయులకు పదోన్నతుల ద్వారా లెక్చరర్స్‌గా, ప్రధానోపాధ్యాయులను ప్రిన్సిపాల్స్‌గా నియమిస్తామని తెలిపినా.. ఇప్పటివరకు వీటికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు లేవన్నారు. పాఠాలు బోధించడానికి లెక్చరర్స్‌ లేకుండా విద్యార్థులు ఇంటర్మీడియట్‌ తరగతులలో చేరడం సాధ్యపడదని, కనుక వెంటనే చొరవ తీసుకుని ఏ పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ తరగతులను ప్రారంభిస్తున్నారో.. ఆ పాఠశాలలకు లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేయిస్తే, ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసుకుంటారని కోరారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement