Tuesday, March 26, 2024

మూడుసార్లు ఓడితే ఇక అంతే.. తెలుగుదేశంలో టిక్కెట్ ఇయ్యం: లోకేశ్‌

అమరావతి, ఆంధ్రప్రభ : మహానాడు తరువాత రాష్ట్రంలో రెండు భారీ కుంభకోణాలు బయటపెట్టనున్నట్టు- తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తెలిపారు. ఒంగోలులోని మహానాడు ప్రాంగణంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను విధ్వంసం చేసిన జగన్‌ రెడ్డి ప్రభుత్వం చేసిన మరో రెండు కుంభకోణాలపై పూర్తి సమాచారం తమకు వచ్చిందనీ, మహానాడు పూర్తి కాగానే వాటిని మీడియా ద్వారా ప్రజల ముందుంచుతామని తెలిపారు. పార్టీ నేతలు సుదీర్ఘకాలం పదవుల్లో కొనసాగే విధానానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందనీ.. ఈ మేరకు దీర్ఘకాలం పదవుల విధానం రద్దు ప్రతిపాదనను మహానాడులో ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడు విడతలుగా కొనసాగుతున్న తన నుంచే ఈ మార్పునకు శ్రీకారం చుట్టనున్నట్టు స్పష్టం చేశారు.

మూడు సార్లు వరుసగా ఎన్నికల్లో ఓడిపోయిన వారికి సైతం రానున్న ఎన్నికల్లో టికెట్లు- ఇవ్వరాదన్న ప్రతిపాదనపై కూడా అంతర్గతంగా విస్తృతంగా చర్చిస్తున్నట్టు- వెల్లడించారు. దీనిపై తమ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టమైన విధానాన్ని ప్రకటించనున్నారని తెలిపారు. రెండు సార్లు ఒకే పదవిలో కొనసాగుతున్న వారందరికీ విరామమివ్వాలన్న ఆలోచన కూడా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులకు పార్టీలో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది..ఈ సారి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తాం. ఈలోగా మరికొందదరికి టికెట్లపై స్పష్టత ఇస్తామన్నారు. డబ్బుతోనే రాజకీయాలు చేయలేం.. డబ్బు లేకపోయినా ఇబ్బందులు తప్పవని ఈ సందర్భంగా లోకేష్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement