Sunday, May 19, 2024

ఆసుపత్రి భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి : ముర‌ళీధ‌ర్ రెడ్డి

నాడు-నేడు కార్యక్రమం క్రింద ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్ల ఏజెన్సీలను ఆదేశించారు. శుక్రవారం కర్నూల్ మెడికల్ కళాశాలలోని న్యూ లెక్చరర్ గ్యాలరీలో ఆసుపత్రి భవనాల నిర్మాణ పనుల ప్రగతిపై రాయలసీమ జిల్లాల ఏపీ ఎంఎస్ఐడీసీ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇంజినీర్ ఇన్ చీఫ్ శివారెడ్డి, ఎస్ఈ లు క్రిష్ణారెడ్డి, రమేష్ రెడ్డి, రాయలసీమ జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏపీ ఎంఎస్ఐడీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ… ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాయలసీమ జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ ఏజెన్సీలను సూచించారు. నాబార్డ్ కింద మంజూరైన కర్నూలులో 16, అనంతపూర్ లో 17, కడపలో 13, చిత్తూరులో 12 వెరసి మొత్తం 58 ఆసుపత్రి భవన నిర్మాణ పనుల్లో వచ్చే సమావేశానికి ప్రగతి కనపరచాలన్నారు. వచ్చే జూన్ నాటికి 25 నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభానికి నోచుకోవాలన్నారు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదన్న నేపథ్యంలో రీజినల్ స్థాయి కాన్ఫరెన్స్ లు నిర్వహించి పనులు ముమ్మరం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పనుల్లో ఆలస్యం చేసే కాంటాక్ట్ ఏజెన్సీలకు నోటీసులు జారీ చేస్తామన్నారు. జరుగుతున్న పనులపై ప్రతిరోజు సమీక్షించాలని ఈ ఈ లను ఆదేశించారు. ప్రభుత్వం నుండి నిధులు వస్తున్న నేపథ్యంలో బిల్లుల చెల్లింపులో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని ఏజెన్సీలతో పాటు కాంట్రాక్టర్లకు సూచించారు. సిన్సియర్ గా పనులు ఎవరు త్వరగా పూర్తి చేసి బిల్లులు సమర్పిస్తారో వారికే ముందుగా బిల్లులు చెల్లిస్తామని ఆయన తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో జరుగుతున్న ఆసుపత్రి భవన నిర్మాణాల పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత ఈఈ లు మేనేజింగ్ డైరెక్టర్ కు నివేదించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement