Friday, May 3, 2024

నెల్లూరులో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలు

ఉపరితల ఆవర్తన ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వానలు ముంచెత్తాయి. ముఖ్యంగా నెల్లూరు నగరంలో వాన దంచికొడుతోంది. గత నాలుగు రోజులుగా నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. నెల్లూరు నగరంలోని ప్రధాన రహదారులపై మోకాలి లోతులో నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నెల్లూరులో సగటున 6.27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అండర్ పాస్‌లు, ప్రధాన కూడళ్ల వద్ద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. తడ మండలంలో అత్యధికంగా 16.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరోవైపు చిత్తూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటి ఉద్ధృతికి పలు మండలాల్లోని వంతెనలు తెగిపోయాయి. పలు గ్రామాలు నీట మునిగాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement