Friday, May 3, 2024

తొలకరి రాకతో రైతుల్లో సంతోషం.. స్పీడందుకుంటున్న సాగు పనులు

అమరావతి, ఆంధ్రప్రభ : సహకరిస్తున్న ప్రకృతితోపాటు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మేడి పట్టి ముందస్తు ఏరువాకకు అన్నదాతలు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. కేరళపై విస్తరించిన నైరుతి పవనాలు మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో కాడెద్దులతో అన్నదాతలు ముందస్తుకు సన్నద్ధమయ్యారు. ఈసారి వాతావరణం బాగా అనుకూలించి ముందస్తుగా రుతు పవనాల రాకతో వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల నుంచి ఎరువుల దాకా సర్వం సిద్ధం చేసి ఇప్పటికే రైతన్నలకు అందుబాటులో ఉంచింది. ముందస్తు ఖరీఫ్‌ సాగు కోసం రాష్ట్రవ్యాప్తంగా వేరుశనగ విత్తనాల పంపిణీ జోరుగా సాగుతుండగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా వరితోపాటు ఇతర పంటల విత్తనాల పంపిణీ ప్రారంభమయ్యాయి. తొలిసారిగా ఆర్బీకేల్లో పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాల పంపిణీ కూడా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ముందస్తు ఖరీఫ్‌కు అనుగుణంగా ఎరువులను కేటాయించేందుకు కేంద్రం అంగీకరించడంతో జూన్‌-జూలై నెలల్లో డిమాండ్‌కు సరిపడా నిల్వ చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు సాగునీటి ప్రణాళికకు అనుగుణంగా గోదావరి డెల్టాకు ఇప్పటికే ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. కృష్ణా డెల్టాతోపాటు గుంటూరు ఛానెల్‌కు కూడా ఈనెల 10వ తేదీ తరువాత విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.

ఎరువులు.. విత్తనాలు

గత ఖరీఫ్‌లో రాష్ట్రంలో 15.34 లక్షల టన్నుల ఎరువులను వినియోగించగా ఈసారి 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. రబీలో మిగిలిన నిల్వలతో పాటు ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏప్రిల్‌, మేలో కేంద్రం 3.47 లక్షల టన్నులను కేటాయించడంతో 7.69 లక్షల టన్నుల ఎరువులున్నాయి. ఇందులో 1.21 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరగడంతో 6.48 లక్షల టన్నులను క్షేత్రస్థాయిలో సిద్ధం చేశారు. వీటిలో 1.50 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల్లో నిల్వ చేశారు. తొలిసారిగా ఆర్బీకేల ద్వారా పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. వీటి కోసం ఇప్పటికే 23 కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది.

తొలుత తూర్పు, పశ్చిమ డెల్టాలో

గోదావరి తూర్పు డెల్టా కింద 2 లక్షలు, సెంట్రల్‌ డెల్టా పరిధిలో 1.7 లక్షల ఎకరాలు, వెస్ట్రన్‌ డెల్టా పరిధిలో 4.3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తొలుత ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో 6.3 లక్షలకుపైగా ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు ప్రారంభం కానుంది. సెంట్రల్‌ డెల్టా పరిధిలో కోనసీమతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాలకు నీరందేందుకు కనీసం 15 రోజులు పడుతుంది. నీటి విడుదలతో ముందుగా రాజమహేంద్రవరం, మండపేట, రాయవరం, రామచంద్రాపురం, కొవ్వూరు, నిడదవోలు, మార్టేరు, పెనుగొండ తదితర ప్రాంతాల్లో నారుమళ్లు పోసుకునేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాలువలకు విడుదలయ్యే నీటిని సద్వినియోగం చేసుకునేలా ఆర్బీకేల ద్వారా రైతులను చైతన్యం చేస్తున్నారు.

- Advertisement -

ఖరీఫ్‌లో సాగు లక్ష్యం 95.23 లక్షల ఎకరాలు..

ఈసారి ఖరీఫ్‌లో 95.23 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 40.76 లక్షల ఎకరాల్లో వరి, 18.26 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 15,97 లక్షల ఎకరాల్లో పత్తి, 8.88 లక్షల ఎకరాల్లో అపరాలు 3.94 లక్షల ఎకరాల్లో మిరప, 2.95 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయనున్నారు. ఈఖరీఫ్‌ కోసం 6,16,664 క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేశారు. 29,417 క్వింటాళ్ల విత్తనాలను 90 శాతం సబ్సిడీతో ఇవ్వనుండగా 5,87,247 క్వింటాళ్ల విత్తనాన్ని 25 నుంచి 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. ఆర్బీకేల్లో 94,542 క్వింటాళ్ల పచ్చి రొట్ట విత్తనాల పిణీ జోరుగా జరుగుతోంది. మరో వైపు 3,29,688 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను అందచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు 1,73,635 క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో సిద్ధం చేశారు. ఇప్పటివరకు 1,25,318 క్వింటాళ్ల విత్తనాల కోసం రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వరి సహా ఇతర పంటలకు సంబంధించి 1,92,433 క్వింటాళ్ల విత్తనాలను బుధవారం నుంచి పంపిణీ చేయనున్నారు. ఇందులో 1,72,234 క్వింటాళ్ల వరి విత్తనాలతో పాటు ఇతర పంటలకు సంబంధించినవి ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement