Friday, April 26, 2024

ఎంపి శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ల విన‌తితో ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది నియామకం

గుంటూరు – ఆసుపత్రులలో పడకల కొరత … ఆక్సీజెన్ కొరత .. ఇంజెక్షన్ లు, మందుల కొరత .. సిబ్బంది కొరత…. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలు జిల్లాలో ఎక్కడో ఒక చోట నుంచి వినిపిస్తూనే వున్నాయి. ప్రభుత్వం, అధికారయంత్రాంగం సైతం తమ దృష్టికి వచ్చిన అంశాలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేస్తోంది. ఆ క్రమంలోనే వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బంది కొరత కారణంగా కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొన్ని సందర్భాలలో సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారని నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను స్వయంగా గుర్తించటంతో పాటు, అధికార పార్టీకి చెందిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సిఫార్సు చేయటంతో జిల్లా యంత్రాంగం ఆఘమేఘాలపైనా స్పందించింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో సిబ్బంది కొరత అధిగమించేందుకు కలెక్టర్ వివేక్ యాదవ్ చొరవ చూపారు.
వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో ఇరువురు మెడికల్ ఆఫీసర్ లు, ముగ్గురు లాబ్ టెక్నీషియన్ లు, మరో ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్ లు, ముగ్గురు ఏం ఎన్ ఓ లు, ఆరుగురు స్టాఫ్ నర్స్ లను కేటాయిస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వినుకొండ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు తో కలసి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వినుకొండ ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన సమయంలో సిబ్బంది కొరత వెలుగు చూసింది. వెంటనే ఆ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా అధికారులు సైతం తక్షణమే స్పందించి సిబ్బంది నియామకం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement