Tuesday, May 7, 2024

జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం స్పందించాలి.. 15 మంది చనిపోయినా కదలరా: చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో తీవ్రమైన ఘటనలు జరిగిన సమయంలో కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించడం లేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. జంగారెడ్డి గూడెంలో మరణాలు, నంద్యాలలో విద్యార్థుల అస్వస్థతపై స్పందించిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన గడిచిన మూడు రోజుల్లో జంగారెడ్డి గూడెంలో 15 మంది మృతి చెందారని, వాంతులు, విరేచినాలు, కడుపునొప్పి లక్షణాలతో ఆస్పత్రికి చేరిన గంటల వ్యవధిలో వారంతా మృతి చెందారని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండి హఠాత్తుగా మృతి చెందుతున్న ఘటనలపై స్థానికులు ఆందోళన చెందుతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని చంద్రబాబు అన్నారు.

మరిన్ని ప్రాణాలు పోకముందే చర్యలు తీసుకోవాలని సూచించారు. మృతి చెందిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. నంద్యాల విద్యార్థుల అస్వస్థత ఘటనపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. కుళ్లిన కోడిగ్రుడ్లు పెట్టడం వల్లే విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని చంద్రబాబు ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement