Sunday, April 28, 2024

Good News – ఈ ఏడాది జోరు వాన‌లు …. ముందుగానే రుతుప‌వ‌నాలు

ఎల్​నినో ప్ర‌భావానికి బ్రేక్
హిందూ మ‌హాసాగ‌రంలో లానినో
ఒక్కసారిగా చ‌ల్ల బ‌డుతున్న వాత‌వ‌ర‌ణం
జూన్ రెండో వారం నుంచే జోరుగా వాన‌లు
సెప్టెంబ‌ర్ వ‌ర‌కు దంచికొట్టనున్నాయి
అన్న‌దాత‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ తీపి క‌బురు

గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. పంటలు పండించేందుకు సరిపడా నీరు లేక కష్టాలను అనుభవించారు. ఎల్​నినో ప్రభావంతో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల నోటికాడికి వచ్చిన పంటలు నీటి ఎద్దడితో ఎండిపోయి పశువులకు మేతగా మారాయి. దీంతో వ్యవసాయమే వృత్తిగా జీవిస్తున్న రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు తీపి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్ మెంట్ (ఐఎండీ) కబురు తీసుకొచ్చింది. ఈసారి ముందుగానే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్లు శుక్రవారం వెల్లడించింది. అంతే కాకుండా ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని చల్లని కబురును అందించింది.

- Advertisement -

హిందూ మ‌హాస‌ముద్రంలో మార్పులు

ఈ ఏడాది రుతుపవనాలు కాస్త ముందుగానే వచ్చే అవకాశమున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. ఎన్నడూలేని విధంగా ఈసారి హిందూ మహాసముద్రం డైపోల్‌ (ఐఓడీ), లానినా పరిస్థితులు ఏకకాలంలో క్రియాశీలకం కానుండటంతో వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండకపోవడాన్ని (ఐఓడీ) అని, మధ్య, తూర్పు పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా చల్లాగా మారటాన్ని లానినా అని అంటారు. ఈ రెండు ప్రక్రియలు ఏకకాలంలో సంభవించడం అత్యంత అరుదైన విషయమని, ఇది నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు.

సాధార‌ణం కంటే అత్య‌ధిక వ‌ర్షం..

సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్‌ మధ్య నమోదయ్యే అత్యధిక వర్షపాతం ఈసారి అంతకన్నా ముందే నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు పశ్చిమ, వాయవ్య భారతంలో ఎక్కువకాలం కొనసాగే అవకాశాలున్నాయని తెలిపారు. దీంతో వర్షపాతం భారీగా ఉంటుందని పేర్కొన్నారు.

ఎల్ నినో ప్ర‌భావంతో తిప్ప‌లు

భారతదేశం వ్యవసాయాధారిత దేశం. మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆదారపడి జీవిస్తున్నారు. పంటలు బాగా పండాలంటే సాగు నీరు ఎంతో ముఖ్యం. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవక వ్యవసాయం అస్తవ్యస్తంగా మారిపోయింది. అయితే లానినోపరిస్థితుల కారణంగా ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే వచ్చి దేశ వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భగభగ ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఎండ తీవ్రతతో పలు ప్రాంతాల్లో తాగు నీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే వర్షాకాలంలో ఈ సారైనా వర్షాలు పడతాయో లేదో అని ఆందోళన చెందుతున్న ప్రజలకు ఇది మంచి వార్తే.. ఈ ఏడాది జూన్ రెండో వారం నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు, సాధారణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement