Tuesday, April 30, 2024

వైద్యవిద్యకు స్వర్ణయుగం.. ఈ ఏడాది అదనంగా 746 సీట్ల పెంపు

అమరావతి ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వైద్య విద్యలో స్వర్ణయుగం నడుస్తోంది. వైద్య ఆరోగ్యరంగంపై సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించిన నేపథ్యంలో సత్ఫలితాలు వస్తున్నాయి. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో పీజీ సీట్లు గణనీయంగా పెరగనున్నాయి. ప్రమాణాలకు అనుగుణంగా సిబ్బందిని ఏర్పాటు చేయడంతో సీట్ల సంఖ్య పెంపుదలకు అనుమతి లభించింది. 2019 వరకూ రాష్ట్రంలో మెడికల్‌ పీజీ సీట్ల సంఖ్య 970 కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన చర్యల ఫలితంగా 2022 ఎకడమిక్‌ ఈయర్‌కు మరో 207 సీట్లు పెరిగాయి.

ఇప్పుడు అదనంగా 746 సీట్లకు దరఖాస్తు చేసేందుకు అవకాశం దక్కింది. ఈ ఏడాదిలో ఈ సీట్లు పెరుగుదల దాదాపు ఖయమైపోయింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకూ మొత్తంగా రాష్ట్రంలో ఉన్న పీజీ సీట్లు 970 అయితే ఈ మూడున్నరేళ్లలోనే మరో 953 సీట్లు పెరగడం వైద్యవిద్యలో అరుదైన ఘట్టంగా సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

మూడున్నర ఏళ్లలో రెట్టింపు

మూడున్నరేళ్లలోనే మెడికల్‌ పీజీసీట్లు రెట్టింపు అవ్వడం ద్వారా పెద్ద సంఖ్యలో వైద్య నిపుణులు అందుబాటులోకి రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య బోధనా సిబ్బంది నియామకాలపై వైసీపీ సర్కార్‌ ప్రత్యేక దృష్టిసారించింది. 1254 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లని నియమించారు. 106 ప్రొఫెసర్‌, 312 అసోసియేట్‌ ప్రొఫెసర్‌, 832 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. వీటిని భర్తీ చేసే ప్రక్రియనే వేగవంతం చేసింది. అవసరమనుకుంటే ప్రైవేటు- రంగంలో ఇచ్చే భారీ వేతనాలను ప్రభుత్వరంగంలోనూ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.

ఇలా సుగమమైంది

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ పద్ధతులను వైద్యారోగ్యశాఖ అవలంబించడం వల్ల ప్రభుత్వ మెడికల్‌ పీజీ సీట్ల పెరుగుదలకు మార్గం సుగమమైందని, ఇది ఒక శుభపరిణామమని అధికారులు పేర్కొంటున్నారు. దీనివల్ల స్పెషాల్టీ, సూపర్‌ స్పెషాల్టీ వైద్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డమే కాకుండా, వైద్య రంగంలో నిపుణుల సంఖ్య పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం అవుతున్న మెడికల్‌ కాలేజీల్లో బోధనావసరాలకు ఇది ఉపయోగపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 17 మెడికల్‌ కాలేజీలు పూర్తైతే, నిర్ణీత సమయానికి సుమారు మరో 3 వేల పీజీసీట్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement