Saturday, May 4, 2024

హైకోర్టులో క్ల‌ర్క్ ఉద్యోగాల పేరిట మోసం.. నకిలీ కాల్‌ లెటర్స్‌ కేసులో ఇద్దరు అరెస్ట్‌..

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీ హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాల పేరిట నకిలీ కాల్‌ లెటర్స్‌ సృష్టించి మోసం చేస్తున్న ఇరువురి వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నకిలీ కాల్‌ లెటర్ల వ్యవ హారంపై హైకోర్టు డిప్యూటీ సెక్షన్‌ ఆఫీసర్‌ కేఎస్‌వీ ప్రసాదర రావు ఈ నెల 16వ తేదీన తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రాజమండ్రికి చెందిన ఎల్లా ఉమామహేశ్వరరావు, నిడదవోలుకు చెందిన పోనంగి సత్యసాయి చక్రధర్‌ అనే ఇరువురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా తుళ్లూరు సీఐ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ నకిలీ కాల్‌ లెటర్ల వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపామని, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరికి చెందిన ఉమా మహేశ్వరరావు, చక్రధర్‌ మరికొందరితో కలిసి నిరుద్యోగులను నకిలీ కాల్‌ లెటర్స్‌ ద్వారా మోసం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నకిలీ కాల్‌ లెటర్స్‌ ఇస్తూ డబ్బులు దండుకుంటున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement