Thursday, April 25, 2024

శివరాత్రికి 3,225 స్పెషల్‌ బస్సులు.. 21లక్షల మంది భక్తుల అంచనా

అమరావతి, ఆంధ్రప్రభ: మహా శివరాత్రికి ఆర్టీసీ 3225 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రాష్ట్రంలోని 96 శైవక్షేత్రాలకు వేర్వేరు ప్రాంతాల నుంచి మార్చి 1న మహా శివరాత్రి పర్వదినం రోజున 21లక్షల మంది భక్తులు వస్తారని ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో భక్తులను సురక్షితంగా పుణ్యక్షేత్రాల సందర్శనకు రాకపోకలు సాగించేలా అదనపు రుసుము లేకుండానే ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అవసరమైతే అదనపు బస్సులు నడిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా కోటప్పకొండకు 410 బస్సుల్లో 2.75లక్షలు, కర్నూలు జిల్లా శ్రీశైలానికి 390 బస్సుల్లో 1.25లక్షల మంది ప్రయాణికులు వచ్చే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కడప జిల్లా పోలతల, నిత్యపూజ కోన, పశ్చిమ గోదావరి జిల్లా బలివె, పట్టిసీమ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతారు.

రెండేళ్లుగా డీజిల్‌ భారం పడినప్పటికీ కోవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని ద్వారకా తిరుమలరావు తెలిపారు. గత ఏడాది చార్జీలనే ఈ ఏడాది కూడా వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రూపు ప్రయాణాలు చేసే భక్తులు ముందస్తు సమాచారం సంబంధిత డిపోల అధికారులకు ఇచ్చిన పక్షంలో తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. కోటప్పకొండ, శ్రీశైలం, పొలతల తదితర శైవ క్షేత్రాలకు ఘాట్‌ రోడ్డు ప్రయాణాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఘాట్‌ రోడ్డులో నడిపే బస్సులను పూర్తిగా తనిఖీ చేసి నడపనున్నారు. ఇందుకోసం ఘాట్‌ రోడ్డు డ్రైవింగ్‌లో అనుభవమున్న డ్రైవర్లను ఏర్పాటు చేస్తున్నారు.

పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని బస్సులు ఎక్కే ప్రాంతాల్లో తాగునీరు, షామియానాలు, విచారణ కేంద్రాలతో పాటు అవసరమైన చోట్ల తాత్కాలిక బస్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. కోటప్ప కొండకు ఏకాదశి పర్వదినం రోజున భక్తుల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పుణ్యక్షేత్రాలకు నడిపే బస్సుల్లో కోవిడ్‌ నిబంధనల మేరకు పూర్తిగా శానిటైజ్‌ చేసి నడుపుతారు. ముఖ్య కూడళ్లు, మలుపుల వద్ద సేఫ్టీ డ్రైవింగ్‌ ఇన్‌స్పెక్టర్లను ఏర్పాటు చేసి భక్తుల భద్రతతో కూడిన ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తాత్కాలిక బస్‌ స్టేషన్లు సహా అన్ని ప్రాంతాల్లో పారిశుద్ద్యం సక్రమంగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రీజియన్ల వారీగా..
రాష్ట్రంలోని రీజియన్ల వారీగా తిరిగే బస్సుల షెడ్యూళ్లను అధికారులు ఖరారు చేశారు. ఎన్‌ఈసీ పరిధిలోని ఆరు పుణ్యక్షేత్రాలకు 175 బస్సులు, విశాఖ రీజియన్‌లోని ఆరు పుణ్యక్షేత్రాలకు 250 బస్సులు, తూర్పు గోదావరి పరిధిలోని 10 పుణ్యక్షేత్రాలకు 100 బస్సులు, పశ్చిమ గోదావరి పరిధిలోని నాలుగు పుణ్యక్షేత్రాలకు 175 బస్సులు, కృష్ణా రీజియన్‌ పరిధిలోని ఏడు పుణ్యక్షేత్రాలకు 225 బస్సులు, గుంటూరు పరిధిలోని పదకొండు పుణ్యక్షేత్రాలకు 800 బస్సులు, ప్రకాశం పరిధిలోని మూడు పుణ్యక్షేత్రాలకు 275 బస్సులు, నెల్లూరు పరిధిలోని ఏడు పుణ్యక్షేత్రాలకు 75 బస్సులు, చిత్తూరు పరిధిలోని 14 పుణ్యక్షేత్రాలకు 350 బస్సులు, కర్నూలు పరిధిలోని పదకొండు పుణ్యక్షేత్రాలకు 450 బస్సులు, అనంతపురం పరిధిలోని ఎనిమిది పుణ్యక్షేత్రాలకు 25 బస్సులు నడుపుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement