Friday, May 17, 2024

లోకేష్ ను కలిసిన గాజులదిన్నె ప్రాజెక్టు ముంపు రైతులు

తెదేపా యువనేత నారా లోకేష్ కు గాజులదిన్నె ప్రాజెక్ట్ ముంపు రైతులు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. గోనెగండ్ల మండలం ఐరన్ బండ-A, ఎన్నెకండ్ల, గంజిహళ్ళి, గోనెగండ్ల, నేరుడుప్పల గ్రామాల రైతులు 1977లో గాజులదిన్నె ప్రాజెక్ట్ కట్టడానికి 5వేల ఎకరాల భూమి ఇచ్చారు. ప్రస్తుతం మిగిలిన ఒకటి, రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నామని లోకేష్ దృష్టికి తెచ్చారు. తాజాగా గాజులదిన్నె ప్రాజెక్ట్ ఎత్తు పెంచాలని ప్రస్తుత ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కమీషన్ల కోసం వైసీపీ నాయకులు ప్రాజెక్టు ఎత్తు పెంచే పనులు మొదలుపెట్టారన్నారు. ముంపు రైతుల సమస్యలు గాలికొదిలేశారు. మా గ్రామంలో ఎకరా భూమి మార్కెట్ ధర రూ.30లక్షల వరకు ఉంది.

కానీ ముంపునకు గురైన భూములకు కేవలం రూ.4.2లక్షలు మాత్రమే పరిహారం ఇస్తామంటున్నారు. ఇది సరి కాదు, తమకు కనీసం ఎకరాకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. జీఓ నెం.98 ప్రకారం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, పునరావాసం కింద రూ.4లక్షల సాయం అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందించాల్సి ఉందన్నారు. ప్రభుత్వమే చట్టవిరుద్దంగా ఇష్టానుసారంగా రైతుల భూమి లాక్కోవడం కుదరదన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందించాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు అండగా నిలుస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement