Monday, April 29, 2024

అమరావతి అసైన్డ్‌ బాగోతంపై ఆగస్టు 10న తుది విచారణ

అమరావతి, ఆంధ్రప్రభ: రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల కొను గోల్‌..మాల్‌కు సంబంధించి ఆగస్టు 10వతేదీన తుది విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. ఇకపై వాయిదాలకు అవకాశంలేదని తేల్చిచెప్పింది.. రాజధాని పేరిట దళిత, బలహీన వర్గాల రైతులకు చెందిన 11 వందల ఎకరాల అసైన్డ్‌ భూముల గోల్‌మాల్‌ వ్యవహారంపై 2020లో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి పొంగురు నారాయణలతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. సీఐడీ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ 2022లో నారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న నారాయణ సమీప బంధువులు, బినామీలపై కూడా కేసు న మోదయింది. తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వీరంతా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఏడాది తాజాగా తనపై నమోదు చేసిన కేసును కూడా కొట్టేయాలంటూ మాజీ మంత్రి నారాయణ మరో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం అప్పట్లో ఆయన అనారోగ్య కారణాల వల్ల కేన్సర్‌ శస్త్ర చికిత్స నిమిత్తం విదేశాలు వెళ్లేందుకు వీలుగా ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణ బంధువులు, బినామీలు దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించి 41ఏ నోటీసులు జారీ చేయాల్సిందిగా హైకోర్టు అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

గత కొద్ది నెలలుగా ఈ కేసుల విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ముందస్తు బెయిల్‌ పొందిన నేపథ్యంలో కేసును కొట్టేసేలా ఆదేశాలు జారీ చేయాలని నారాయణ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. గురువారం ఈ వ్యాజ్యాలు మరోసారి కోర్టు ముందుకొచ్చాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి విచారణ ప్రారంభించారు. నారాయణ తరపు న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ ఈ కేసును సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సి ద్ధార్థ లూద్రా వాదించాల్సి ఉందని ఆయన అందుబాటులో లేనందున వాయిదా వేయాలని కోర్టును అభ్యర్థించారు. సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకరరెడ్డి స్పందిస్తూ ఇప్పటికే పలుమార్లు వాయిదా కోరారని తాజాగా సిద్ధార్థ లూద్రా రాలేదనే సాకు చూపుతూ వాయిదా కోరటం తగదన్నారు. పిటిషనర్ల త రపు మరో సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ ఇరువర్గాల అభ్యర్థన మేరకు వాయిదాలు పడ్డాయని గుర్తుచేశారు. కేసు తదుపరి విచారణ ఆగస్టు చివరి వారానికి వాయిదా వేయాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇక సుదీర్ఘ వాయిదాలకు ఆస్కారంలేదని స్పష్టం చేశారు.

ఆగస్టు మొదటివారంలో విచారణపై కొద్దిసేపు చర్చించిన అనంతరం న్యాయమూర్తి 10వ తేదీకి తుది విచారణ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకు గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా అమరావతి గ్రామాల్లో పేదలకు చెందిన అసైన్డ్‌ భూములను కారుచౌకగా కొనుగోలు చేసి వాటిని భూ సమీకరణ కింద ప్రభుత్వానికి ఇచ్చి తద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లతో పాటు కౌలు పొందుతున్న వ్యవహారంపై సీఐడీ మరో కేసు దాఖలు చేసింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణలను నిందితులుగా చేర్చింంది. ఈ కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు, నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వక్కలగడ్డ రాథాకృష్ణ కృపాసాగర్‌ విచారణ జరిపారు. వాదనల నిమిత్తం ఈనెల 12వ తేదీకి ఈ కేసు విచారణ వాయిదా వేస్తూ జస్టిస్‌ రాథాకృష్ణ కృపాసాగర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement