Sunday, May 5, 2024

కొత్త జిల్లాలపై కౌంటర్లు దాఖలు చేయండి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు

అమరావతి, ఆంధ్రప్రభ: కొత్త జిల్లాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసింది కేవలం ముసాయిదా మాత్రమే.. అది ఓ రకంగా షోకాజ్‌ నోటీసు లాంటిది.. దీనిపై అభ్యంతరాలేవైనా ఉంటే ప్రభుత్వానికే తెలియజేయాలి.. తుది నోటిఫికేషన్‌లో లోపాలు ఉంటే కోర్టుకు రావాలని స్పష్టం చేసింది.. కొత్త జిల్లాల ఏర్పాటు రాజ్యాంగానికి, రాష్ట్రపతి ఉత్తర్వులు, ప్రధానంగా 371-డీకి విరుద్ధమని వాటిని రద్దుచేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా వివిధ శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వ్యక్తులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరుపు న్యాయవాది అంబటి సుధాకర్‌రావు వాదనలు వినిపించారు. కొత్త జిల్లాల ఏర్పాటు రాజ్యాంగంలోని 371-డీకి విరుద్ధమన్నారు.

అదే సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ 371-డీ అమల్లో ఉండగానే తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందికదా అని ప్రశ్నించింది. దీనికి 371-డీకి సంబంధం ఏమిటని నిలదీసింది. రాష్ట్రానికి విద్య, ఉపాథి అంశాల్లో న్యాయం చేసేందుకు మాత్రమే ఈ అధికరణ నిర్దేశించిందని ఈ ప్రకారం జిల్లాను ఓ యూనిట్‌గా తీసుకుని ఉద్యోగాల భర్తీ జరుగుతుందని న్యాయవాది సుధాకర్‌రావు వాదించారు. దీని ఆధారంగానే లోకల్‌ కేడర్‌, ఏరియాను నిర్ణయించారని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ పాలనా వ్యవహారాలు పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనివి.. పాలనాపరమైన సౌలభ్యం నిమిత్తం కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే అధికారంలేదని తాము చెప్పటంలేదని రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఆ తరువాత జిల్లాలను ఏర్పాటు చేసుకోవచ్చని గతంలో రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించిన సందర్భాలు ఉన్నాయని న్యాయవాది గుర్తుచేశారు. అంటే ఎప్పటికీ 13 జిల్లాలో ఉండాలని కోరుతున్నారా అని ధర్మాసనం పిటిషనర్లను ధర్మాసనం నిలదీసింది.

అసలు రాజ్యాంగంలో కొత్త జిల్లాలపై నిషేధం ఎక్కడుందో వివరించాలని ధర్మాసనం ఆదేశించింది. కొత్త జిల్లాల ఏర్పాటు చేసే సమయంలో ఆ జిల్లా కూడా ఓ లోకల్‌ ఏరియా, ఓ యూనిట్‌గా ఉంటుంది కదా అని ప్రశ్నించింది. కొత్త జిల్లాలు ఏర్పాటుతో జోనల్‌ వ్యవస్థ కూడా మారుతుందని న్యాయవాది సుధాకర్‌ రావు వాదించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై 8 వేల వరకు అభ్యంతరాలు ప్రభుత్వానికి అదాయని వాటిని పరిగణనలోకి తీసుకోలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్లు ఏం చేస్తారని ప్రశ్నించింది. ఇద్దరు నిరుద్యోగులని, ముగ్గురూ రాజకీయ పార్టీలకు చెందిన వారు కారని న్యాయవాది వివరణ ఇచ్చారు. ప్రభుత్వం కొత్త జిల్లాల పేరుతో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఈ ప్రతిపాదనను ధర్మాసనం తిరస్కరించింది. ముసాయిదాపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని నిరాకరించింది. అభ్యంతరాలేవైనా ఉంటే తుది నోటిఫికేషన్‌ను సవాల్‌ చేసుకోవచ్చని వీలు కల్పించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ ఏడాది జూన్‌ 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement