Friday, June 14, 2024

Exclusive – ప్రేమంటే సీతదే!… చ‌ట్టాలు, స‌రిహ‌ద్దులూ దాటేసింది

సహనం.. సంయమనం.. సంతోషం.. సంతాపం.. అన్నీ మహిళే.. ఆమె అందం అనితరం. ఆలోచన అద్భుతం. తలచినదా గీత దాట గలదు. కల్లోల కడలిని ఎదురీదగలదు. తాను వ‌ల‌చిన‌దా దేనికీ త‌ల‌వంచ‌దంతే. ఇది రామాయణం కావొచ్చు. భారతమూ కావొచ్చు. ఇతిహాసాల్లోనే కాదు అధునాతన భారతంలో.. అందులో తెలుగుగడ్డపై పుట్టిన ఓ జానకీ క‌థ ఇది.. మను ధర్మ శాస్త్రాన్నే ధిక్కిరించిందా మ‌గువ‌. అటు మత చక్ర బంధం.. ఇటు రాచరిక కట్టుబాట్లను లెక్క చేయలేదు. ఆయుధంగా త‌న సొగ‌సు, సౌందర్యాన్నే ఎక్కుపెట్టింది. పురుషాధిక్య సమాజంలో సమిధను కాదని నిరూపించింది. ద‌శాబ్దాలు గ‌డిచినా.. నేటికీ ఆమె పోక‌డ అంద‌రినీ ఆశ్య‌ర్యానికి గురిచేస్తోంది. ఆలోచ‌న‌ల‌ను రేకెత్తిస్తోంది. నవీన స్త్రీవాది చ‌లం మానస పుత్రికగా ఆమెను చెప్పుకోవ‌చ్చు.. ఇంత‌కీ ఆమె ఎవ‌ర‌నే క‌దా మీరు ఆలోచించేది. ఆగండి అక్క‌డికే వ‌స్తున్నా.. ఆ సోగ‌క‌ళ్ల వ‌య్యారి, కంటి చూపుల‌తో మ‌న‌సుల‌ను దోచుకునే మ‌ధ‌న సుంద‌రి మ‌రెవ్వ‌రో కాదండోయ్‌.. మ‌న‌ పిఠాపురం యువరాణి సీతాదేవీ.

- Advertisement -

ఎన్నో అవరోధాల్ని ఎదురీదిన ధీర
మను ధర్మాన్నే లెక్క చేయని మ‌గువ‌
మత మార్పిడితో ఆడంబ‌రంగా పెళ్లి
అడుగ‌డుగునా క‌నిపించిన‌ విలాస జీవ‌నం
ప్రేమ కోసం పెటాకులకూ వెనుకాడలేదు
బ‌రోడా సంస్థానం చేరిన ఏపీ మ‌హ‌రాణి
ఇదొక‌.. పిఠాపురం యువ‌రాణి ప్రేమ కథ

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం మార్మోగిపోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిత్యం కోసం ఎదురు చూస్తున్న ఈ పిఠాపురం నియోజకవర్గం కాకినాడ సాగర తీరానికి అతి సమీపంలోని సహజ సంపదల నెలవు. రాజకీయ చదరంగానికి మహా వేదికగా మారింది. కానీ, పిఠాపురం అంటే దేశంలోనే మహత్తర చారిత్రాత్మక ఘట్టం. స్వాతంత్య్ర‌ పోరాటంలోనే అత్యున్నత విద్యాపురంగా వెలుగొందిన పిఠాపురంలో అప్పటి సామాజిక కట్టబాట్లను తెంచుకున్న ఓ ప్రేమ కథ ఇప్పటికీ.. ఔరా అనిపిస్తోంది. ర్యాలీ ప్రసాద్ అనే రచయిత విరచిత ‘పిఠాపురం చరిత్ర’ అనే పుస్తకం ఆధారంగా ‘రాణి సీతాదేవీ’ కథ అడుగుడుగునా ఆస‌క్తిని రేపుతోంది.

పుట్టినిల్లు పిఠాపురం… మెట్టినిల్లు చల్లపల్లి

నాటి ఆంధ్రావనిలోని అనేక సంస్థానాల్లో నేటి కాకినాడ జిల్లా పిఠాపురం మేటీ సంస్థానం. కాకినాడలోని పిఠాపురం రాజా కాలేజీ, పిఠాపురంలోని రాజారావు భావయమ్మా రావు జూనియర్ కాలేజీ.. నాటి సంస్థానపు ఆనవాళ్లు. ఈ మహా పిఠాపురం సంస్థానంలో రావు వెంకట కుమార మహాపతి సూర్యారావు, చిన్నమాంబదేవికి మూడో కుమార్తె సీతాదేవీ. 1917 మే 2న సీతాదేవి జన్మించారు. ఉయ్యూరు సంస్థానాధీశుడు రాజా మేకా వెంకయ్యప్పారావును సీతాదేవి వివాహం చేసుకున్నారు. 1935లో వీరికి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడున్నాడు. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి అవధులు లేవు. అయితే.. సంపదకు వ్యసనం తోడుకావడంతో సీతాదేవీ మ‌న‌సు మారింది. తన భర్త ఉయ్యూరు రాజాతో కలిసి సీతాదేవీ రేసులకు వెళ్లి.. అక్క‌డి ప‌రిస్థితుల‌ను ఆస్వాదించటం ఆమెకు ఆనవాయితీగా మారింది.

మద్రాసు రేసులో.. కీలక మలుపు

గుర్రపు రేసులకు మద్రాసులో అడుగుపెట్టిన సీతాదేవీ జీవితం కీలక మలుపు తిరిగింది. బరోడాకు చెందిన మహారాజా ప్రతాప్‌సింగ్ గైక్వాడ్ అప్ప‌టికే దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఆయన విలాసవంతుడు. గుర్రపు పందేల మీద విపరీత ఆసక్తితో మద్రాసులో గుర్రపు పందేల క్లబ్బు వద్ద రాణి సీతాదేవిని ప్రతాప్ సింగ్‌ చూశారు. తొలిచూపులోనే ఆమె అందానికి ముగ్ధుడ‌య్యారు. మ‌న‌సుపారేసుకున్నారు. కానీ, అప్ప‌టికీ ఏడేళ్ల కిందటే సీతాదేవికి పెళ్లి జరిగింది. ఆమెను మళ్లీ పెళ్లి చేసుకోవాలని ప్రతాప్‌సింగ్ గ‌ట్టిగా అనుకున్నారు. బ‌రోడా మ‌హారాజు ప్రేమ‌లో సీతాదేవి ప‌డిపోయింది. అప్పుడే వీరి ప్రేమ కథలో కీలక మలుపు తిరిగింది.

వీరిద్ద‌రిదీ సంక‌ట స్థితి.. అయినా ప్రేమ‌ను గెలిచారు
యువ‌రాణి సీతాదేవీకి అప్ప‌టికే పెళ్లి అయ్యింది. భర్త ఉన్నాడు. మ‌రోవైపు బ‌రోడా మ‌హారాజుకు పెళ్లి అయ్యింది. భార్య ఉంది.. ఈ రెండు గొప్ప కుటుంబాలకు చెందిన ఇద్దరు మరో పెళ్లికి సిద్ధపడితే.. అప్పటి సమాజం సహించే అవకాశమే లేదు. ఇటు చల్లపల్లి సంస్థానం అంగీకరించినా అటు బరోడా సంస్థానం అంగీకరించే ప‌రిస్థితుల్లో లేదు. అంత‌టి క‌ఠోర ప‌రిస్థితుల్లోనూ వారి ప్రేమ‌ను గెలిపించుకున్నారు.

అవరోధాల బారికేడ్లను దాటి..

బరోడా రాజు ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌తో పెళ్లికి రాణీ సీతాదేవి అంగీకరించినప్పటికీ ఎన్నో అవరోధాలు ఎదుర‌య్యాయి. ముఖ్యంగా బరోడా సంస్థానం కట్టుబాట్లను అనుసరించి మహారాజా కుటుంబంలో రెండో వివాహానికి అవకాశం లేదు. అప్పటికే సీతాదేవి తొలి వివాహం చేసుకుని ఉండటం దీనికి మరో అడ్డంకిగా మారింది. ఈ నిబంధనలు అధిగమించి తమ వివాహానికి ఆటంకాలు తొలిగించుకోవాలని ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌, సీతాదేవి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. బరోడా సంస్థానంలో న్యాయ నిపుణుల సలహాతో మత మార్పిడికి సిద్ధమయ్యారు. ఇతర మత స్త్రీని వివాహం చేసుకోవటానికి అవకాశం ఉండటంతో మతం మారితే బరోడాలో అమలవుతున్న హిందూ వివాహ చట్టం పరిధి నుంచి తప్పించుకోవచ్చని భావించారు. ఇటు రాణీ సీతాదేవి ఇస్లాం మతం స్వీకరించారు. ఈ చట్టం ప్రకారం ఉయ్యూరు రాజా నుంచి విడాకులు తీసుకున్నారు. ఇక‌.. బ‌రోడా మ‌హారాజుతో పెళ్లి అనంత‌రం మళ్లీ హిందూమతాన్ని స్వీకరించారు. ఇలా 1943లో ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌ని పెళ్లి చేసుకున్నారు. 80 ఏళ్ల కిందటి రాణి సీతాదేవి ప్రేమ, గాంధర్వ్య వివాహం ఇప్ప‌టికీ అంద‌రిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

బ్రిటిష్ పాలకుల అభ్యంతరాలు..

సీతాదేవీ, ప్రతాప్ సింగ్ వివాహంపై అప్పట్లో బ్రిటిష్ వైస్రాయ్ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే.. చట్ట ప్రకారం తొలి వివాహం రద్దు చేసుకున్న తర్వాత ఆమెకు రెండో వివాహానికి అడ్డంకులుండవని, రెండో వివాహం నిషేధం చట్టంపై స్పందిస్తూ.. రాజ్యంలోని చట్టాలకు రాజుకు మినహాయింపు ఉంటుందని వాదించారు.ఇక రాజ్యానికి వారసుడు గైక్వాడ్ మొదటి భార్య శాంతాదేవి కొడుకే అవుతాడనే షరతుపై వివాహాన్ని వైస్రాయ్ గుర్తించారు.అయితే.. అప్పట్లో సీతాదేవిని మహారాణిగా గుర్తించేందుకు బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించ లేదు. ఆమెను రాజ్యంలోని మహారాణులను ప్రోటోకాల్ ప్రకారం పిలిచే ‘హర్ హైనెస్’ గా సంబోధించకూడదని నిర్ణయించారు.

సవతి పోరులోనూ..

సీతాదేవి రాకతో రాజకుటుంబంలో గందరగోళం నెలకొంది. ప్రతాప్‌సింగ్ మొదటి భార్య శాంతాదేవితో సీతాదేవికి పొసగలేదు.ఇద్దరు రాణులు విడివిడిగా నివసించారు. శాంతాదేవి లక్ష్మీవిలాస్ ప్యాలెస్‌లో, సీతాదేవి మకరపుర ప్యాలెస్‌లో ఉన్నారు. 1945లో వారికి వారసుడు శాయాజీరావు గైక్వాడ్ జన్మించారు. అదే సంవత్సరంలో ఆమె మొనాకోలోని మాంటీకార్లోకి వలస వెళ్లారు. అప్పటికే మాంటీకార్లో నగరం విలాసవంతమైన జీవితాలకు, కాసినో సహా అనేక జూద క్రీడలకు కేంద్రంగా ఉండేది. రేసు గుర్రాలు సహా వివిధ పందేలకు అలవాటు పడిన సీతాదేవి తన భర్తతో కలిసి మాంటీకార్లో సిటీకి వెళ్లారు. ఇక దేశానికి స్వాతంత్య్రం రావడం, సంస్థానాలను భారత ప్రభుత్వం విలీనం చేసుకోవడంతో ఆమె అక్కడే స్థిరపడ్డారు.

ప్ర‌తాప్‌సింగ్‌తోనూ విభేదాలు

మొనాకోలో స్థిరపడి, అక్కడి విలాసవంతమైన జీవితం గడుపుతున్న మహారాజా ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌ను 1951లో భారత ప్రభుత్వం సంస్థానాధిపతి హోదాను తొలగించింది.కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీలు ఆయన మొదటి భార్య సంతానానికి దక్కుతాయంటూ ఆదేశాలు ఇచ్చింది. దాంతో ప్రతాప్ సింగ్ తిరిగి ఇండియాకు రావడానికి సిద్ధపడటంతో రాణి సీతాదేవితో విభేదాలు వచ్చాయి. చివరకు 1956లో ప్రతాప్ సింగ్ గైక్వాడ్ తో సీతాదేవి విడాకులు తీసుకున్నారు. భారత ప్రభుత్వానికి దక్కాల్సిన విలువైన వజ్రాలు, ఆభరణాలను ఆమె మొనాకోకు తరలించడం వల్ల ఆమె ఇండియాకు రావడంపై మీద ఆంక్షలు పెట్టారు.

అక్క కూతురికి ఆస్తులు

దేశంలోనే అత్యంత విలాస జీవితం గడిపిన మహారాణి, అత్యంత సౌందర్యవరాశిగా పేరొందిన రాణి సీతాదేవీకి సొంత ఎయిర్ జెట్ ఉండేది. విలువైన సంపదకు వారసురాలు కావడంతో ఖర్చులకు వెనుకాడలేదు. వివిధ దేశాల్లో పందేలకు వెళ్లేవారు. చివరకు ఆమె భారతదేశం వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో బంధువులను కలిసేందుకు కొలంబో వెళ్లేవారు. ఆ తర్వాత లండన్ వెళ్లిపోయేవారు. ఆమె మరణించిన తర్వాత తన ఆస్తిని అక్క కూతురు అనంగ రేఖాదేవికి అప్పగించారు. ఇంతటి విలాసజీవితం గడిపిన వ్యక్తులు బహుశా దేశ చరిత్రలో మరొకరు ఉండ‌రేమో. అది కేవ‌లం పిఠాపురం సంస్థానానికే సొంతం అనే భావ‌న‌ను చ‌రిత్ర‌కారులు వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement