Friday, June 14, 2024

Exclusive – రాజ‌కీయ వార‌స‌త్వ పరంప‌ర … బరిలో మాజీ సీఎంల బిడ్డలు

నేదురుమ‌ల్లి, కోట్ల‌, ఎన్‌టీఆర్‌, నాదెండ్ల భాస్కర్​రావు,
చంద్ర‌బాబు, వైఎస్సార్ వార‌స‌త్వం
ఏపీ లోక్‌స‌భ‌కు కొంద‌రు.. అసెంబ్లీకి ఇంకొంద‌రు
ఎవరికి వారు ధీరులే.. గెలిచెదెవరు, ఓడెదెవరు?
మున్ముందు వారి భవితవ్యం ఏమిటీ
గెలుపు, ఓటముల‌పై బుకీల ఆఫర్లు
ఏపీ రాజకీయాల్లో చర్చోపచర్చలు

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి:
ఏపీలో ఆరుగురు మాజీ ముఖ్య‌మంత్రుల‌ వారసులు ఈసారి ఎన్నికల బరిలో దిగారు. తమ ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అని పోటీప‌డ్డారు. కొందరికి సునాయస విజయం ఖాయమని భావిస్తుంటే.. మరి కొందరి రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నల వ‌ర్షం కురుస్తోంది. ఈ రాజ‌కీయ ప‌రంప‌ర‌లో ఎవ‌రికి వారే ధీరులు.. కానీ, ఎన్నిక‌ల్లో మాత్రం గెలుపు ఓట‌ములు అనేవి మాత్రం చాలా డిఫ‌రెంట్ అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇ.. ప్ర‌స్తుతం సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఏడో విడ‌త కొన‌సాగుతున్న వేళ‌.. మ‌రో 11 రోజుల్లో ఫ‌లితాలు రానున్నాయి. ఈ క్ర‌మంలో ఎవ‌రు గెలుస్తారు.. ఎవ‌రు ఓట‌మి చెందుతార‌నే విష‌యంలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. మూడు ప్రధాన పార్టీల్లోనూ అయిదుగురు మాజీ సీఎంల కుమారులు, మరో మాజీ సీఎం కుమారుడు, కుమార్తె నువ్వానేనా అనే రీతీలో పోటీ ప‌డుతున్నారు. ఈ నియోజకవర్గాలపైనే అంద‌రి దృష్టి నెల‌కొంది. కాగా, ఈ ఆరుగురిలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో గెలవటం కన్నా.. ఓడిపోవటం ఖాయమంటూ బెట్టింగులు సాగుతున్నాయి. దీంతో బుకీలు కూడా రంగంలోకి దిగి పందేలకు తెరలేపారు.

- Advertisement -

వైఎస్ జగనన్న ..

దివంగత సీఎం వైఎస్సార్​ తనయుడు జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనకు ప్రత్యేకత ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఒక టర్మ్​ పనిచేశారు. ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పనిచేసి హఠాన్మరణం చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా జగన్ సొంత పార్టీ పెట్టి ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఆయన పులివెందుల నుంచి ఈసారి బరిలోకి దిగారు. విజయం సునాయాసమే అన్న టాక్​ వినిపిస్తోంది. మెజారిటీ ఎంత అనే విషయంలోనే చర్చ జరుగుతోంది.

నారా లోకేశ్​..

ఉమ్మడి ఏపీలో, విభజిత ఏపీలోనూ పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుమారుడుగా లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చారు​. మంగళగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. లోకేష్ తాత ఎన్టీ రామారావు కూడా ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో లోకేశ్​ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోసారి ఇక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో దిగారు. ఈసారి కూడా లోకేశ్​ గట్టి పోటీ ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. అయితే.. గత ఓటమి సానుభూతితో గట్టెక్కే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

నాదెండ్ల మనోహర్..

జనసేన కీలక నేతగా ఉమ్మడి ఏపీ మాజీ ఉపసభాపతిగా నాదెండ్ల మనోహర్​కు మంచి పేరుంది. ఉమ్మడి ఏపీలో నెలరోజుల పాటు సీఎంగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు కుమారుడిగా ఆయన రాజకీయ వారసత్వంలోకి వచ్చారు. తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన నుంచి పోటీ చేశారు. గత ఎన్నికల్లో కూడా జనసేన నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి వైసీపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడటంతో తన గెలుపుపై నాదెండ్ల మనోహర్ ధీమాగా ఉన్నారు.

నందమూరి బాలకృష్ణ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో దివంగత సీఎం , టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు.. సినీ హీరో నందమూరి తారక రామారావు అందరికీ సుపరిచితమే. అందరికీ అన్నగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఇక.. హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్టీఆర్​ వారసుడిగా బాలకృష్ణ బరిలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరసగా గెలిచిన బాలయ్య.. ఈసారి కూడా అదే ఊపులో విజయం సాధించి.. హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు. కాగా, హిందూపురం నియోజకవర్గం పార్టీకే కాకుండా నందమూరి కుటుంబానికి కూడా కంచుకోట కావడంతో బాలయ్య గెలుపుపై అనుమానం లేదనే వాదనలున్నాయి. అయితే.. గతంలో కన్నా ఈసారి తీవ్ర పోటీని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది.

కోట్ల సూర్య ప్రకాశ్​రెడ్డి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాశ్​రెడ్డి. గతంలో కర్నూలు ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే.. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈసారి డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. డోన్​లో బలమైన ప్రత్యర్థితో తలపడ్డారు. అయితే గెలుపుపై మాత్రం ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నేదురుమిల్లి రామ్​కుమార్ రెడ్డి..

ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి. గతంలో తల్లి నేదురుమిల్లి రాజ్యలక్ష్మి మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.అక్కడ టీడీపీ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. నేదురుమిల్లి కుటుంబంపై సానుభూతితో రామ్​కుమార్​రెడ్డి విజయం తథ్యమని అంటున్నారు. ఇదే విషయంపై రామ్ కూడా అంతే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్ షర్మిల..

ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా షర్మిల తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. 2019 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ తన అన్న జగన్​ కోసం ప్రచారం నిర్వహించారు. అయితే.. తెలంగాణలో వైఎస్సార్​టీపీ పేరుతో పార్టీని పెట్టి అక్కడ కొంతకాలం రాజకీయాలు సాగించారు. ఇక.. ఆ పార్టీని కాంగ్రెస్​లో విలీనం చేసి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. కాగా, ఈ ఎన్నికల్లో కడప లోక్​సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలో దిగారు. కానీ, తన సొంత కుటుంబం నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారు. తన తండ్రి ఆశయాలతో పాటు తన కుటుంబ నేపథ్యం తనను పార్లమెంటుకు పంపుతుందనే భావనలో ఉన్నారు. ఇలా ఆరుగురు మాజీ ముఖ్యమంత్రుల బిడ్డలు ఈ ఎన్నికల్లో పోటీచేశారు. వారి రాజకీయ వారసత్వం.. భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. మరి జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలతో వీరి పరంపర ఏమవుతుందో తేలిపోనుంది.

దగ్గుబాటి పురందేశ్వరీ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు తనయ దగ్గుబాటి పురం దేశ్వరీ… ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా రాజమండ్రిలో పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన పురందేశ్వరీ విశాఖపట్నం ఎంపీగా పోటీచేశారు. కేంద్ర మంత్రిగా పని చేశారు. రాజకీయ ఎత్తుగడలో ధీశాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేశారు. ఏపీలో అంతంత మాత్రంగా కనిపించే బీజేపీనే తన శైలిలో నడిపింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారు. ఈ స్థితిలో వైసీపీ అభ్యర్థిపై పోటీ చేస్తున్న పురందేశ్వరీ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. కానీ జనసేన, టీడీపీ బలగంతో ఆమె ఎంపీ గెలవటం ఖాయం…. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం ఖాయమని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement