Monday, April 29, 2024

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి.. నేడు ఎమ్మెల్సీలకు నోటిఫికేషన్‌

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ నేడు విడుదల కానుంది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. మంగళవారం నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేయనుంది. ఈ నెల 16 వరకూ నామినేషన్ల స్వీకరణ, నవంబరు 17 నుంచి నామినేషన్లను పరిశీలించి.. నవంబరు 22న ఉపసంహరణ.. నవంబరు 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. 

తెలంగాణలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులపై సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనచారి, రవీందర్‌రావు, ఎల్‌. రమణ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్‌ రెడ్డి, కోటిరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ రేసులో ముందున్నట్లు ప్రచారం జరగుతోంది. వీరితో పాటు మరికొంత మంది ఆశావహులు ప్రగతి భవన్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల 16న నామినేషన్ల దాఖలకు గడువు ఉండడంతో.. ఆలోపు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి.

ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీకి 103, మిత్రపక్షమైన ఎంఐఎంకు 7, మొత్తం కలిపి 110 ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్ కు ఆరుగురు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అయితే ఒక ఎమ్మెల్సీకి పది మందికి పైగా ఎమ్మెల్యేలు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఆరు స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే సునాయాసంగా ఏకగ్రీవం కానున్నారు.

మరోవైపు ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈనెల 29న పోలింగ్‌ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కిస్తారు.  మే 31న మండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్, సోము వీర్రాజు (బీజేపీ), గోవిందరెడ్డి (వైసీపీ)ల పదవీకాలం ముగియడంతో వారి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో మూడు స్థానాలూ ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే ఏపీలో ఎమ్మెల్సీ ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గోవింద్ రెడ్డికి హామీ ఇచ్చిన జగన్‌.. మరో ఇద్దరి అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. శాసనసభలో వైసీపీకి పూర్తి సంఖ్యా బలం ఉండటంతో.. ప్రకటించిన ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక కావటం లాంఛనమే కానుంది. ఏపీ శాసనమండలిలో మొత్తం 58 స్థానాలు ఉండగా, అధికార వైసీపీకి 18 మంది సభ్యులు ఉన్నారు. ఖాళీగా ఉన్న స్థానాలు భర్తీ చేస్తే అన్నీ వైసీపీ ఖాతాలో పడనున్నాయి.

ఇది కూడా చదవండి: MLC elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్.. ఆ ఆరుగురు ఎవరు?

Advertisement

తాజా వార్తలు

Advertisement