Saturday, July 27, 2024

నీటిని మళ్లించి, పంటలను కాపాడండి: సీపీఎం

ఉరవకొండ రూరల్ : హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ కింద‌ సాగు చేసిన వేరుశెనగ పంటకు నీరు లేక ఎండిపోతున్నాయని, హెచ్ ఎల్ సీ కాలువ నుండి హంద్రీనీవాకు నీటిని మళ్లించి, పంటలను కాపాడాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. గురువారం మండలం లోని చిన్న ముష్టూరు గ్రామం వద్ద ఎండుతున్న వేరుశెనగ పంట పొలాలను, ఇంద్రావతి వద్ద ఉన్న డీప్ కట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది ఎకరాల లో వేరుశెనగ పంటను రైతులు సాగు చేశారని, పంట సాగు చేయడానికి ఎకరాకు 35 వేల రూపాయలు వరకు పెట్టుబడులు పెట్టారన్నారు. పంట దిగుబడులు వచ్చే సమయంలో కాలువకు అర్ధాంతరంగా నీటి సరఫరాను నిలిపివేశార‌న్నారు.
దీనితో రైతులను జగన్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టే వేసిన‌ట్ట‌యింద‌న్నారు. గతంలో మార్చి, ఏప్రిల్ వరకు నీటిని సరఫరా చేశారన్నారు.
ఈ ఏడాది నీటి ఆపేయ‌డంతో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. హెచ్ ఎల్ సి ద్వారా మార్చి ఆఖరి వరకు హంద్రీ-నీవాకు నీటిని మళ్లించాల‌న్నారు. గత ఏడాదిలో పంట దెబ్బతిన్న రైతుల్లో ఇప్పటి వరకు అనేక మందికి పంట నష్ట పరిహారం దక్కలేదన్నారు.పార్టీలకు అతీతంగా పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం కార్యదర్శి రాంభూపాల్, జిల్లా రైతు సంఘం కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, రైతు సంఘం నాయకులు మధుసూదన్ నాయుడు, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement