Monday, May 6, 2024

AP: రాతియుగమా.. స్వర్ణయుగమా తేల్చుకోండి : చంద్రబాబు

వెంకటగిరి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : మరో 82 రోజుల్లో రానున్న ఎన్నికల్లో రాతియుగాన్ని తలపించే జగన్ పాలన కావాలో, తెలుగుదేశం- జనసేన ఇచ్చే స్వర్ణయుగం పాలన కావాలో తేల్చుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రా కదలి రా పేరుతో నిర్వహించే సభల పరంపరలో భాగంగా ఈరోజు ఆయన తిరుపతి జిల్లా వెంకటగిరి సభలో పాల్గొన్నారు. ఆ సభలో చంద్రబాబు మాట్లాడుతూ… సమాజంలోని ఏ వర్గాన్ని వదలకుండా దోచుకుంటున్న జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఓటును వజ్రాయుధంగా వినియోగించాలన్నారు. అలవికానీ హామీలు ఇచ్చి ఒక్క అవకాశం ఇవ్వండి అంటే నమ్మి అధికారం అప్పగించినందుకు కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోపెట్టినట్టు అయ్యిందన్నారు.

ఈ సందర్బంగా కనకపు సింహాసనంపై శునకంను కూర్చుండబెట్టి.. అనే సుమతి శతక పద్యాన్ని చదివి వినిపించారు. తాను వెంకటగిరి-శ్రీసిటీ-తిరుపతి మధ్య ప్రాంతాన్ని ఇండస్ట్రీయల్ హబ్ గా చేయాలని చూస్తే జగన్ రకరకాల మాఫియాలతో దోపిడీ చేసాడని ఆరోపించారు. ఇందుకు తగినట్టుగా తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని సూళ్లూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి, తిరుపతి ఎమ్మెల్యేలు ఇసుక, గనుల దోపిడీ, భూకబ్జాలతో దోచుకుంటున్నారని విమర్శించారు. తప్పు అన్నందుకు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని పక్కన పెట్టి మరో దోపిడీదారును ఇన్ ఛార్జ్ చేశారన్నారు.

సత్యవేడు ఎమ్మెల్యేను రబ్బర్ స్టాంప్ గా మార్చిన మైనింగ్ డాన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారంతో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి రాతియుగం పాలన అందిస్తున్న జగన్ కావాలో, అన్ని వర్గాలకు మేలుచేస్తూ అభివృద్ధి సంక్షేమం అందించే తెలుగుదేశం – జనసేన ఉమ్మడి పాలన అందించే స్వర్ణయుగం పాలన కావాలో తేల్చుకోవాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేసిన తాను ఎన్నో పదవులు చూశానని, ఇప్పుడు రాష్ట్రం భవిష్యత్ కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటానని, తనకు పదవుల కన్నా రాష్ట్ర సంక్షేమమే ముఖ్యమని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement