Friday, May 3, 2024

Cuddapah – వాళ్ల‌ద్ద‌రినీ ఓడించాల్సిందే – హంతకులు చట్ట సభల్లో వద్దు: షర్మిల

రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
అప్పుల పాలు చేశారు
కడప స్టీల్ ప్లాంటు లేదు
సాగునీటి కల నెరవేరలేదు
రాజన్న ఆశయాల సాధనకు ఒక్క చాన్స్‌ ఇవ్వండి
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల
కడపలో కొన‌సాగుతున్న బస్సు యాత్ర
పెద్ద దర్గా, దేవుడి కడపను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు

ఆంధ్ర‌ప్ర‌భ‌, కడప బ్యూరో: నేను మీ రాజన్న బిడ్డను.. వైఎస్సార్‌, వివేకా బాటలోనే నడుస్తా.. మీకు అందుబాటులో ఉంటా.. ఇక్కడే ఉంటా. నన్ను ఎంపీగా చూడాలని చిన్నాన్న కోరిక. ఆయన ఆశయ సాధనకు పోటీ చేస్తున్నా. ఏ కష్టమొచ్చినా మీ బిడ్డ మీ ముందు ఉంటుంది. ఒక్క అవకాశం ఇవ్వండి.. అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలా రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగనన్నకు మళ్లీ ఓటు అడిగే హక్కులేదన్నారు. హత్యారాజకీయాలు ప్రోత్సహిస్తూ.. చిన్నాన్న వివేకా హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడు. వీరిద్దరిని ఓడించాల్సిన అవసరమే ఎంతైనా ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల ప్రచార నేపథ్యంలో చేపట్టిన బస్సుయాత్ర రెండవ రోజుకు చేరుకుంది. శనివారం కడప పట్టణంలో షర్మిల బస్సు యాత్ర నిర్వహించారు. మొదట కడప పెద్ద దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు షర్మిల కు శాలువా బహుకరించారు. అక్కడి నుంచి మాసాపేట సర్కిల్ కు చేరుకున్న షర్మిల కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

- Advertisement -

హంతకులు చట్ట సభల్లో వద్దు

దివంగత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మనిషి అని ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నోఅద్భుతాలు చేశారన్నారు. ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నారు. బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలారని ఆరోపించారు. ఒకప్పుడు వైఎస్‌, వివేకా జిల్లా ప్రధాన నాయకులని.. ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండేవారన్నారు. వైఎస్‌ వెళ్లిపోయారు. వివేకాను గొడ్డలితో క్రూరంగా చంపివేశారు. వివేకా చనిపోయి ఐదేళ్లు దాటింది. అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు లేవు. హంతకుడు అవినాష్ రెడ్డే అని అన్ని ఆధారాలున్నాయి. ఫోన్ కాల్స్‌ ఉన్నాయి. అయినా కేసు ఒక్క అడుగుముందుకు పడడంలేదన్నారు. అధికారం అడ్డుపెటుకుని బయట తిరుగుతున్నారన్నారు. హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లకూడదని.. అధర్మం వైపు నిలబడ్డ అవినాష్ కావాలా?.. న్యాయం వైపు నిలబడ్డ వైఎస్‌ షర్మిల కావాలా?.. మీరే తేల్చుకోవాలని షర్మిల సూచించారు.

సొంత జిల్లాకు ఏమీ చేయలేదు

జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికే కాదు సొంత జిల్లాకు ఏమీ మేలు చేయలేదన్నారు. విభజన చట్టం ప్రకారం కడపకు స్టీలు ఫ్యాక్టరీ తేలేదన్నారు. ఫ్యాక్టరీకి ఇప్పటికే రెండుసార్లు శంకుస్థాపన చేశారు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి, లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేవని షర్మిల చెప్పారు. ఈ ప్రాంత ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఏ రోజు స్టీల్ ప్లాంట్ గురించి కేంద్రాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవు. కేంద్రం ఇచ్చిన విభజన హామీలపై ప్రశ్నలు వేయలేదని ఎద్దేవా చేశారు.

భయం వద్దు …నేనున్నా

మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. మీకు ఏ కష్టమొచ్చినా మీ బిడ్డ ముందు ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్ కు మళ్లీ ఓటు అడిగే హక్కులేదన్నారు. ఆయన రాష్ర్టాన్ని అప్పులపాలు చేశాడని ఆరోపించారు. కడప స్టీలు ప్లాంటు, జిల్లా సాగునీటి ప్రాజెక్టులు వైఎస్సార్ కల. జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. స్టీలు ప్లాంటు లేదు. రాజన్న ఆశయాలను నెరవేర్చేందుకు ఆయన బిడ్డగా నేను మీ ముందుకు వస్తున్నాను. ఒక అవకాశం ఇచ్చి కడప పార్లమెంటు స్థానం నుంచి ఎంపిక గెలిపించాలని షర్మిల కడప ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పూతలపట్టు ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిక

కాగా చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తో సమావేశమై కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా షర్మిలా ఎమ్మెల్యే ఏంఎస్ బాబు కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీసీసీ మీడియా చైర్మన్ ఎన్ తులసి రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement